చంద్రవంచ కాగ్నా నది వద్ద టిప్పర్లను అడ్డుకున్న యువకులు సర్ది చెప్పేందుకు వెళ్లిన తహసీల్దార్‌తో వాగ్వాదం ఖాళీ వాహనాలతో వెనక్కు వెళ్లిన కాంట్రాక్టర్
ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న యువకులు
తహసీల్దార్‌తో యువకుల వాగ్వాదం
తాండూరు రూరల్: మండలంలోని చంద్రవంచ గ్రామంలో మళ్లీ ఇసుక పంచాయితీ మొదలైంది. గత శుక్రవారం గ్రామ శివారులోని కాగ్నా నది నుంచి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను ప్రజలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కూడా అధికారులు, కాంట్రాక్టర్లను మందలించారు. ఇవేవీ లెక్క చేయని కాంట్రాక్టర్ గురువారం మరోసారి ఇసుక తరలింపునకు టిప్పర్లతో వచ్చాడు. విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ అక్రం, వార్డు సభ్యులు, గ్రామ యువకులు వాగు వద్దకు వెళ్లి టిప్పర్లను అడ్డుకున్నారు. వాహనాల ముందు బైఠాయించారు. కరన్‌కోట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్లను అడ్డుకోవద్దని యువకులను సూచించారు. కాదని మెండికేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినా యువకులు బెదరలేదు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తహసీల్దార్‌తో వాగ్వాదం
తహసీల్దార్ తారాసింగ్ సిబ్బందితో కలిసి చంద్రవంచ గ్రామానికి చేరుకున్నారు. ఉప సర్పంచ్, యువకులతో మాట్లాడారు. ఇసుక తరలింపునకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం వరకు పెద్దేముల్ మండలం కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతుల కోసం వందలాది టిప్పర్లను ఇసుకను తరలించారని తెలిపారు. ప్రస్తుతం వాగులో ఇసుక లభ్యత లేదన్నారు. ఉన్న కొద్ది పాటి నిల్వలను తరలిస్తే భవిష్యత్‌లో తాగునీటికి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఇసుక తరలింపును మాత్రం ఒప్పుకోమన్నారు. పర్మిషన్ పేరుతో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. తహసీల్దార్ ఎంత చెప్పినా యువకులు వినలేదు. దీంతో ఆయన వెనుదిరిగారు. టిప్పర్లు కూడా ఖాళీగా వెళ్లిపోయాయి.


