● తెలంగాణలో ఒంటరిగానేఅధికారం చేపడతాం
● అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి
మహేశ్వరం: జైశ్రీరామ్ అంటూనే తెలంగాణను అభివృద్ధి చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండల పరిధిలోని చిన్న తూఫ్ర, సిరిగిరిపురం, డబిల్‌గూడ గ్రామాల్లో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుస్థిర పాలన మోదీతోనే సాధ్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 1.40 కోట్ల టన్నుల ధ్యానం కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 55 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించిందన్నారు. రైతుల అభ్యున్నతి కి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి చేసిన వరంగల్ డిక్లరేషన్ అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని.. నియోజకవర్గ పునర్విభజనలో మహేశ్వరం రెండు నియోజకవర్గాలు ఏర్పడుతుందని రెండు స్థానాల్లోనూ కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఇటీవల అమిత్‌షా చెప్పారని సొంతంగానే కొట్లాడి అధికారంలోకి వస్తామ న్నా రు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు టి.యాదీశ్, పెద్దమ్మ తండా, డబిల్‌గూడ, సిరిగిరిపురం సర్పంచ్‌లు రవి నాయక్, యాదమ్మ, కృష్ణవేణి, బీజేపీ రాష్ట్ర నాయకులు పాపయ్యగౌడ్, అనంతయ్యగౌడ్, రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, ఓబీ సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సుదర్శన్ యాదవ్ పాల్గొన్నారు.


