తాండూరు టౌన్: కూలి పనికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తలారి హరికృష్ణ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పలు కుల, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన తలారి హరికృష్ణ పని నిమిత్తం ఏప్రిల్ 29న రుద్రారం గ్రామానికి వెళ్లాడు. అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, నేటి వరకు నిందితులను పట్టుకోలేదన్నారు. హరికృష్ణది ముమ్మాటికే హత్యేనని, పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. బీసీలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం స్పందించాలన్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేయని ఎడల ఆందో ళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి, ముదిరాజ్ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు లొంక నర్సిములు, రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహిద్, ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కప్ప, గుమ్మడి రత్నం, జయప్రసాద్, బుగ్గప్ప, రవికాంత్, బసంత్, మగ్దూం, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


