ఊపందుకున్న ఉపాధి | - | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న ఉపాధి

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

అందరి సహకారంతోనే..

వికారాబాద్‌: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఊపందుకున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ మాసంలో 50 వేల మంది కూలీలు అధికంగా వస్తున్నారు. కలెక్టర్‌, ఆర్‌డీఓ నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉపాధి పనుల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ పనులు లేని కాలంలో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం 2008లో దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ఈ పథకం ద్వారా జిల్లాలో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు కొన్ని పనులకే పరిమితమైన ఈ పథకం ప్రస్తుతం 50కి పైగా పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వ్యవసాయ అనుబంధ పనులు, పొలాల గట్ల వెంట మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వుకోవడం, పాఠశాల క్రీడా మైదానాల చదును, పశువుల, గొర్రెల, మేకల పాకలు నిర్మించుకోవడం, మట్టి రోడ్లు వేసుకోవడం, చెక్‌ డ్యాంలను ఏర్పాటు చేసుకోవడం వంటి వాటికి అవకాశం కల్పిస్తున్నారు.

నిత్యం 60వేల మందికి పైగా..

జిల్లాలో 1,86,197 జాబ్‌కార్డులు.. 3,77,087 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 74,953 మంది ఉపాధి పనులకు వస్తున్నారు. 20 మండలాల్లో రోజుకు సగటున 60వేల నుంచి 70వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. గత నెలలో రోజుకు 20వేల మందే వచ్చేవారు. ప్రస్తుతం అత్యధికంగా పెద్దేముల్‌ మండలంలో 7,171 మంది, ధారూరులో 5,735 మంది, మర్పల్లిలో 5,018 మంది కూలీలు పనులకు వస్తున్నారు. అయితే కూలి గిట్టుబాటు కావడంలేదని పలువురు అంటున్నారు.

తగ్గుతున్న పనిదినాలు

కేంద్ర ప్రభుత్వం ఏటా ఉపాధి పనుల్లో కోత విధిస్తూ వస్తోంది. సంస్కరణల పేరుతో నిబంధనలను కఠినతరం చేస్తూ పేదలను పనులకు దూరం చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కల్పించాల్సిన పని దినాల్లో దాదాపుగా కోటి రోజులు కోత విధించిందంటే ఈ ప్రభావం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం కూలీల్లో ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం నిర్ణయించిన పనులు మాత్రమే చేపట్టాలనే నిబంధన ఇబ్బందిగా మారింది. గతంలో ఉదయం 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహ్నం వరకు ఇళ్లకు చేరుకునే వారు. ప్రస్తుతం ఉదయం ఒక పని.. మధ్యాహ్నం తర్వాత మరో పనికి సంబంధించి ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. రెండు సార్లు ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌లో ఫొటోలు దిగాలి. ఇందు కోసం కూలీలు మండుటెండలో వేచి చూడాల్సి వస్తోంది.

జిల్లాలో చురుగ్గా ఉపాధి హామీ పథకం పనులు

జాబ్‌కార్డులు 1,86 లక్షలు

కూలీల సంఖ్య 3.77 లక్షలు

ప్రస్తుతం పనికిహాజరవుతున్న వారు 74,953

గత నెలతో పోలిస్తే

50వేల మంది అధికం

జిల్లాలో 74వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. వారం రోజుల్లోగా కూలీలకు డబ్బులు అందుతున్నాయి. అందరి సహకారంతో పనులు బాగా కల్పించగలుగుతున్నాం. మూడేళ్లుగా ఉపాధి పనుల్లో మన జిల్లా ముందు వరుసలో ఉంది.

– శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

Advertisement
 
Advertisement
Advertisement