బషీరాబాద్: పాత కక్షలు రెండు కుటుంబాల మధ్య పాశవిక దాడులకు దారితీశాయి. ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకోవడంతో తొమ్మిది మందికి రక్తగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఇరు కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సభావత్ శంకర్‌నాయక్, రమావత్ బాబునాయక్ కుటుంబాల మధ్య గత పంచాయతీ ఎన్నికల నుంచి కక్షలు కొనసాగుతున్నాయి. పది రోజుల క్రితం జరిగిన ఓ పెళ్లికి సంబంధించి, రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. ఈక్రమంలో బుధవారం ఉదయం రాథోడ్ లోక్యానాయక్ ఇంటి వద్ద స్థానిక గిరిజన నాయకుడు వెంకటేశ్‌నాయక్ మాట్లాడుతుండగా లక్ష్మణ్‌నాయక్ వచ్చి ఇంట్లోకూర్చుని మాట్లాడమేంటి.. ఆలయం వద్ద మాట్లాడాలి అంటూ గట్టిగా అరిచాడు. దీంతో పంచాయితీ గుడి వద్దకు చేరింది. ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరగడంతో రమావత్ బాబునాయక్ కుటుంబ సభ్యులు సభావత్ శంకర్ నాయక్‌పై దాడికి దిగారు. దీంతో రెండు కుటుంబాలు అక్కడే ఉన్న వంట చెరుకు కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు చేతికందిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో శంకర్‌నాయక్ తలకు తీవ్రగాయాలు కావడంతో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరి కుటుంబానికి చెందిన ఐదుగురికి రక్తగాయాలు కాగా, బాబునాయక్ తరఫున వారికి నలుగురికి గాయాలయ్యాయి. బషీరాబాద్ సివిల్ ఆస్పత్రిలో పోలీసులు వీరికి చికిత్సలు చేయించారు.
14 మందిపై కేసులు
సభావత్ శంకర్‌నాయక్ కొడుకు మోత్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబునాయక్, లక్ష్మణ్‌నాయక్, మోహన్‌నాయక్, హద్దునాయక్, లోక్యానాయక్, బలరాంనాయక్, గోపాల్‌నాయక్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే రమావత్ బాబునాయక్ ఫిర్యాదుతో సభావత్ శంకర్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్, బలరాంనాయక్, మోత్యానాయక్, వెంకట్ నాయక్, రాజునాయక్, శాంతిభాయిపై కేసులు నమోదయ్యాయి.
గ్రామంలో టెన్షన్ టెన్షన్
రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో నీళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుకుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై దౌర్జన్యంగా దాడులు చేశారని, బీఆర్‌ఎస్ గ్రామ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తే.. తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు. న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ నాయక్, రోదిస్తున్న భార్య
కర్రలతో దాడి చేసుకున్న ఇరు కుటుంబాలు
తొమ్మిది మందికి రక్త గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
14 మందిపై కేసు నమోదు
నీళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం


