పునర్‌ నవీకరణ పూజలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పునర్‌ నవీకరణ పూజలు ప్రారంభం

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

కొడంగల్‌: పట్టణంలోని బాలాజీ నగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్‌ నవీకరణ పూజలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తిరుమల అర్చకులు భగవత్‌ ప్రార్థన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తు మండల పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, హలయుగలాంగల పూజాకర్షణ తదితర వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాగశాలలో హోమం తదితర పూజలను వైభవంగా చేశారు. గురువారం ఉదయం పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోగణ పూజ, గోగణ నివేదన, పూర్ణాహుతి, యాగశాల వాస్తు, అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద శిలాశుద్ధి, మహాశాంతి హోమం ఉంటాయని తెలిపారు. 8వ తేదీ ఉదయం 7.10 గంటల నుంచి 8.20 గంటల మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస కార్యక్రమం నిర్వహిస్తారు. పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని అర్చకులు కోరారు. పూజా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ గుప్తా, ఆలయ ధర్మకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఆలయ నమూనా

మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ నమూనాను అధికారులు సిద్ధం చేశారు. ఆలయ విస్తరణ ప్రభుత్వం రూ.110 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు ప్రారంభమయ్యాయి. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూలైన్‌, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement