ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువు పెంపు
పరిగి మండలంలో అనుమతులు లేకుండా చేసిన వెంచర్
వికారాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు అందించింది. 2024లో అప్పటి ప్రభుత్వం మొదటిసారి ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 33వేల మందికి లబ్ధి చేకూరే అవకాశం లభించింది. 20 నెలలుగా అనేక మార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరో రెండు నెలలు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అనేక సంవత్సరాలుగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డీటీసీపీ అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తూ వచ్చారు. రియల్టర్లు కొనుగోలుదారుల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్లాట్లు విక్రయిస్తూ వెళ్లారు. 2020లో అప్పటి ప్రభుత్వం టీఎస్ బీపాస్ నిబంధన అమలులోకి తెచ్చింది. అనుమతిలేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు షాక్‌కు గురయ్యారు. ఇంటి నిర్మాణ అనుమతులు పొందాలంటే ప్లాట్లు, వెంచర్లకు అనుమతులు తప్పనిసరి చేశారు. దీంతో విధిగా క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆరేళ్ల క్రితం అప్పటి సర్కారు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించింది. తదనంతర ప్రక్రియను విస్మరించింది.
అనుమతులు లేనివే అధికం
జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని లే అవుట్లే అధికంగా ఉన్నాయి. దాదాపు 550 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కనీస రుసుం చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆరేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపి వేసింది. దీంతో నాలుగు నెలల పాటు వ్యవసాయేతర భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేందుకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 20,968, గ్రామ పంచాయతీల్లో 12,745 దర ఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్నింటిని క్రమబద్ధీకరించగా మెజార్టీ అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
మరో రెండు నెలలు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
25శాతం రాయితీ కూడా..
నాలుగు మున్సిపాలిటీల్లో 20,968 దరఖాస్తులు
గ్రామ పంచాయతీల్లో 12,745 అర్జీలు
పరిశీలనకు త్రిసభ్య కమిటీలు
తరచూ గడువు పొడిగింపుతో..
అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫమైందనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువును తరచూ పొడిగిస్తుండటంతో ఎవరూ ముందుకు రావడంలేదు. తాజాగా రెగ్యులరైజ్ చేసుకునేందుకు 25 శాతం ఫీజు రాయితీ కూడా ప్రకటించింది. గతంలో రూ. 1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోగా.. మరి కొందరు రూ.10వేలు చెల్లించి అర్జీ పెట్టుకున్నారు. ఇందులో రూ.1,000 చెల్లించిన వారికి ప్రభుత్వం అవకాశం ఇవ్వగా రూ.10 వేలు చెల్లించిన వారు ఎదురుచూస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు మూడు శాఖల అధికారులతో త్రిసభ్య కమిటీలు వేశారు.


