శ్రీవారి ఆలయ
అభివృద్ధికి
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్‌నవీకరణ పూజలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రూ.110 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8వ తేదీ ఉదయం 7.10 నుంచి 8.20 గంటల మధ్యలో శంకుస్థాపన చేస్తారు. సీఎం దంపతులు ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన, భూమి పూజ) కార్యక్రమం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. తిరుమల తరహాలో నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూ లైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నారు.
కార్యక్రమ వివరాలు
● 6వ తేదీ(బుధవరం) ఉదయం భగవత్ ప్రార్థన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తు మండల పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, హలయుగలాంగల పూజాకర్షణం నిర్వహిస్తారు.
● 7వ తేదీ(గురువారం) పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోగణ పూజ, గోగణ నివేదన, పూర్ణాహుతి, యాగశాల వాస్తు, అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద శిలాశుద్ధి, మహాశాంతి హోమం ఉంటాయి.
● 8వ తేదీ(శుక్రవారం) ఉదయం కుంభారాధన, చతుర్వేద శిలలకు అభిషేకం, హోమాలు, పుర్ణాహుతి, ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) కార్యక్రమాలు ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి బహిరంగ సభ ప్రాంగణం, యాగశాల, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి పునర్‌నవీకరణ పూజలు
8న సీఎం రేవంత్‌రెడ్డిచేతుల మీదుగా శంకుస్థాపన
ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం


