పరిగి: పరిశ్రమల పేరుతో ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవడం దారుణమని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో రైతులు 43 రోజులుగా చేస్తున్న దీక్షకు మంగళవారం మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పంట పొలాలను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రియల్ దందా చేయడం తప్పా కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పులే చేసిందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బాధిత రైతులకు సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేల ఎకరాల పోడు భూములు ఉన్నాయని.. వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పీర్ మహ్మద్, వెంకటేశ్, విజయలక్ష్మి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పంట పొలాల్లోపరిశ్రమల ఏర్పాటు దారుణం
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ


