యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో దీర్ఘకాలిక రుణాలు పొంది, తిరిగి చెల్లించని వారి ఆస్తుల జప్తునకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధమవుతోంది. యాచారం పీఏసీఎస్‌లో 1,500 మంది రైతులకు పైగా తమ పట్టాదారు, పాసుపుస్తకాలను మార్టిగేజ్ చేసి రూ.50 కోట్లకు పైగా లాంగ్‌టర్మ్ లోన్లు పొందారు. వీరంతా పౌల్ట్రీ, డెయిరీఫాం, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టారు. తీసుకున్న రుణాలను ఏటా మార్చి 30లోపు వాయిదాలతో కూడిన రుణం, వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 550 మందికి పైగా రైతులు ఏటా సక్రమంగా వాయిదాలు చెల్లిస్తూ పీఏసీఎస్‌కు సహకరిస్తున్నారు. మిగిలిన వారు మొండికేశారు. దీంతో అధికారులు వీరి ఇళ్లు, వ్యవసాయ బావుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హెచ్‌డీసీసీ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పీఏసీఎస్ అధికారులు పలుమార్లు రైతులను కలిసి బకాయిలు చెల్లించాలని హెచ్చరికలు చేసినా మార్పు రావడం లేదు.
లీగల్ నోటీసులు అందజేత
యాచారం పీఏసీఎస్‌లో గత మూడేళ్లుగా 932 మంది రైతులు సక్రమంగా వాయిదాలు చెల్లించడం లేదు. వీరికి లీగల్ నోటీసులు పంపినా ఫలితం లేకుండాపోతోంది. దీంతో రుణాల కోసం తాకట్టు పెట్టిన పొలాల జప్తునకు అధికారులు రెడీ అయ్యారు. ఈనెల 15న ఉదయం 11 గంటలకు యాచారం పీఏసీఎస్‌లో అసలు, వడ్డీతో కలిపి అప్పులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హెచ్‌డీసీసీ జాయింట్ రిజిస్ట్రార్ మనోజ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో ఈ నెల 30 లోపు తీసుకున్న అప్పు మొత్తంతో పాటు అపరాధ రుసం కలిపి, ఆస్తులు జప్తు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. చింతపట్ల, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, తమ్మలోనిగూడ, నందివనపర్తి, యాచారం, చౌదర్‌పల్లి, మంతన్‌గౌరెల్లి, నక్కర్తమేడిపల్లి, నస్దిక్‌సింగారం తదితర గ్రామాల్లో మొండి బకాయిలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించినా స్పందన లేదన్నారు.
కొత్త వారికి అందని రుణాలు
దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యాచారం పీఏసీఎస్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది. వసూళ్ల సేకరణలో అప్పటి పాలకవర్గంతో పాటు సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించింది. దీంతో మూడేళ్లుగా యాచారం పీఏసీఎస్‌కు రూపాయి కూడా కేటాయించలేదు. ఇదిలా ఉండగా, వివిధ గ్రామాలకు చెందిన సుమారు వంద మందికి పైగా రైతులు లాంగ్‌టర్మ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రుణాలు అందకపోవడంతో చాలా మంది తమ అప్లికేషన్లను వెనక్కి తీసుకుని, కమర్షియల్ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు.
మూడేళ్లుగా రుణాల వసూలు పరిస్థితి
ఏడాది టార్గెట్ వసూలైంది బకాయి
2023– 24 రూ.26 కోట్లు రూ.10 కోట్లు రూ.16 కోట్లు
2024– 25 రూ.34 కోట్లు రూ.13 కోట్లు రూ. 21 కోట్లు
2025– 26 రూ.32 కోట్లు రూ.12 కోట్లు రూ.20 కోట్లు
మొండి బకాయిలతో పీఏసీఎస్‌కు అవస్థలు
ఈనెల 15లోపు చెల్లించాలని నోటీసులు
రైతులు స్పందించాలని సూచన
లేదంటే ఆస్తులు జప్తుచేస్తామని హెచ్చరిక


