ఇసుక డంప్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుక డంప్‌ సీజ్‌

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

రంగారెడ్డికి సేవారత్న అవార్డు ఉత్తమ సేవలకు ‘ప్రశంస’ సిటిజన్‌ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ ఎన్నిక

బషీరాబాద్‌: మండలంలోని జీవన్గీ గ్రామ శివారు కాగ్నానది ఒడ్డున నిల్వ చేసిన భారీ ఇసుక డంపును రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. నదీ పరీవాహక గ్రామాలైనా క్యాద్గీరా, జెట్టూరు గ్రామాల సర్పంచులు జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రైతులు సూర్య ప్రకాశ్‌ రెడ్డి, మల్లికార్జున్‌, బల్‌రామ్‌ మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ఇసుక డంపు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన జీపీఓలు అస్లాం, మధు, రికార్డు అసిస్టెంట్‌ మున్నెప్ప అక్కడికి చేరుకొని 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేశారు. ఈ ఇసుక మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మాజీ ఎంపీకి చెందినదిగా రైతులు ఫిర్యాదు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గోశాల నిర్మాణం కోసం ఇసుక డంపు చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది.

షాద్‌నగర్‌: వృద్ధుల సేవాశ్రమం నిర్వహిస్తూ 25 ఏళ్లుగా సేవలందిస్తున్న పట్టణానికి చెందిన రంగారెడ్డి దాసరి నారాయణరావు సేవారత్న అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో టాలీవుడ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పలువురికి నిర్వాహకులు దాసరి నారాయణ రావు సేవారత్న అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షాద్‌నగర్‌ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో 25 ఏళ్లుగా నవోదయ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధులకు సేవ చేస్తున్న రంగారెడ్డి సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. సాంస్కృతిక శాఖ డైరక్టర్‌ డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

కందుకూరు: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఉత్తమ సేవలు అందిస్తున్న మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అండేకార్‌ నాగరత్నం రాష్ట్రస్థాయిలో ప్రశంసా పత్రం అందుకున్నాడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించడం, సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేలా తర్ఫీదు ఇవ్వడం, తన సొంత పిల్లలను కూడా అదే పాఠశాలల చదివించి ఆదర్శంగా నిలవడం, కోర్టులు, ఇతర ప్రభుత్వ శాఖల పని తీరును తెలుసుకునేలా విద్యార్థులను నేరుగా తీసుకెళ్లడం లాంటి చేస్తుండడంతో ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఐఏఎస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఈ.నవీన్‌ నికోలస్‌ ఆయనను సన్మానించి ప్రశంసా పత్రం అందించారు.

కందుకూరు: సిటిజన్‌ విజిలెన్స్‌, మానిటరింగ్‌ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో మంగళవారం దళిత, గిరిజన, ఆదివాసి, ప్రజాసంఘాలు, మేధావులు, విలేకరులు, న్యాయవాదులు, డీవీఎంసీ సభ్యులు సమావేశమై కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా బోడ కృష్ణ, కో కన్వీనర్‌గా జోగు రమేష్‌, సభ్యులుగా దివ్యశ్రీ, కంబాలపల్లి సంతోష, దరువుల శంకర్‌, మిన్నాల డేవిడ్‌, మమత, రఘు, రాములు, యాచారం మండల కన్వీనర్‌గా బడే భాగ్యమ్మను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డీబీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు గండు నరసింహ, హైకోర్టు అడ్వకేట్‌ దివ్యశ్రీ, అంబేడ్కర్‌ జాతర ఫౌండర్‌ జి.సుధాకర్‌, ప్రజా సంఘాల నాయకులు నరసింహ, శేఖర్‌, యాదయ్య, భగవంతు, బాలమణి, కుమార్‌, సంతోష్‌, తాండ్ర యాదయ్య, గోరేటి జగన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement