ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం కొనుగోలును తక్షణమే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. మండలంలోని రాయపోల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి కోతలు పూర్తికావస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలును ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం ఉండటంతో వర్షాలు పడితే రైతులు నష్టపోయే ప్రమాదముందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సివస్తోందన్నారు. కిరాయికి పట్టాలు తెచ్చుకొని ధాన్యం ఆరబోసుకుంటున్నారని.. ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇవ్వాలన్నారు. తేమ, తాలు పేరుతో క్వింటాలుకు నాలుగైదు కిలోల తరుగు తీస్తున్నారని.. ఇది రైతులను దోచుకోవడమేనని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. రాయపోల్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇటీవల వడదెబ్బకు గురై మృతి చెందిన రైతు గౌరయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రటించాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యుడు సామెల్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాక రామంచందర్‌, సీహెచ్‌ బుగ్గరాములు, పి.జగన్‌, సీహెచ్‌ జంగయ్య, ఎ.నర్సింహ, సీహెచ్‌ ముసలయ్య, భిక్షపతి, యాదగిరి, నర్సింహ, అశోక్‌ పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Advertisement
 
Advertisement
Advertisement