కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం డీఎన్‌టీ సర్టిఫికెట్ జారీతో సంచార జాతి కులాలకు మేలు చేకూరుతుందని బైలు కమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ సూర్యవంశీ, రాష్ట్ర సంచార జాతుల ఉపాధ్యక్షుడు మోహన్ చవాన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం తమ కులాలకు న్యాయం చేశారని కొనియాడారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంచార జాతుల సంక్షేమం, గుర్తింపు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. బీసీ ఏ గ్రూపులో ఉన్న 49 కులాలు, బీసీ ఈ గ్రూపులో ఉన్న 2 కులాలను కలిపి మొత్తం 51 కులాలను సంచార జాతులుగా గుర్తించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల తరహాలో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంచార జాతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బైలు కమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ సలోంకి, శివాజీ, కృష్ణ, భీమయ్య, కొడంగల్ బైలు కమ్మర సంఘం అధ్యక్షుడు ఆనంద్ పవార్, జనరల్ సెక్రటరి శివాజీ, విజయ్, సంజు, బాబు చవాన్ తదితరులు పాల్గొన్నారు.


