ఆశ్రమం.. ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమం.. ఆదర్శం

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

‘పది’ ఫలితాల్లో సత్తా చాటుతున్న ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులు

బొంరాస్‌పేట: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను తన ఖాతాలో వేసుకుంటున్నాయి. చౌడాపూర్‌ మండలం కొత్తపల్లిలో, మర్పల్లిలో ఆశ్రమ పాఠశాలలు.. బొంరాస్‌పేట మండలం బొట్లోనితండా, కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల, రాంపూర్‌లో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. కుల్కచర్ల, తాండూరు పట్టణాల్లో ఎస్సీ బాలికల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో అనాథ పిల్లలు, చదువు మానేసిన చిన్నారులు, వలస కుటుంబాలకు చెందిన పిల్లలు, నిరుపేదల పిల్లలు చదువుకుంటున్నారు. ఏటా 3 నుంచి 10వ తరగతి వరకు 450 మంది విద్యనభ్యసిస్తున్నారు. మన జిల్లాతోపాటు, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకొంటున్నారు. ఇప్పటి వరకు ఆయా పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకున్న సుమారు పాతిక మందికిపైగా మంచి కొలువుల్లో స్థిరపడ్డారు. అలాంటి వారిలో కొందరు..

వైద్య విద్య చేస్తూ..

మండలంలోని ఊరెనికి తండాకు చెందిన రుక్కీబాయి, మోహన్‌నాయక్‌ దంపతుల కూతురు కోమల్‌. బొంరాస్‌పేట మండలం బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో (2018–19) పదో తరగతిలో 9.7 గ్రేడ్‌తో మండల టాపర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇంటర్‌ పూర్తి చేసి ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించింది. ప్రస్తుతం వికారాబాద్‌ మహవీర్‌ ఆస్పత్రిలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా..

బొట్లోనితండాకు చెందిన రాథోడ్‌ కమల (2017–18) పదో తరగతిలో మంచి మార్కులు సాధించింది. పట్టుదలతో పైచదువులు పూర్తి చేసి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీయర్‌ పని చేస్తోంది. తండ్రి హర్యానాయక్‌ ఆటో డ్రైవర్‌.

ఏఎన్‌ఎంగా..

బిచ్చాల్‌తండాకు చెందిన అనూష(2017–18)పదో తరగతి వరకు చదివింది. పాఠశాలలో మెరుగైనా మార్కులు సాధించింది. మధ్యలో చదువు మానేయకుండా ఏఎన్‌ఎం చేసి తిరిగి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తోంది.

సర్పంచ్‌గా గెలిచి..

మండల పరిధిలోని బాపల్లితండాకు చెందిన కోమల్‌(2017–18) ఇదే ఆశ్రమ పాఠశాలలో చదివి బీటెక్‌ పూర్తి చేసింది. తల్లి లక్ష్మి అంగన్‌వాడీ కార్యకర్త. విద్యావంతురాలైన కోమల్‌ కోస్గిలో జరిగిన సీఎం సభలో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసి అందరి మన్ననలు పొందింది.

పదికి పది

కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన లక్ష్మి ముదిరాజ్‌(2021–22) పదో తరగతిలో 10/10 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చేస్తోంది.

ఉన్నతంగా జీవించాలని..

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం సెగిరెడ్డిఘనపూర్‌కు చెందిన పద్మ(2022–23) పదో తరగతిలో 9.5 మార్కులు సాధించింది. ప్రస్తుతం బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉద్యోగంతో ఉన్నతంగా జీవించాలనే పట్టుదలతో ఉన్నానని పద్మ చెబుతోంది. ప్రస్తుతం ఐఐటీ కోచింగ్‌ తీసుకుంటోంది.

మండల టాపర్‌గా..

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం, దాచకపల్లికి చెందిన చెంచుబిడ్డ స్రవంతి (2023–24) పదో తరగతిలో 9.3 గ్రేడ్‌ సాధించి మండల టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్‌ పూర్తి చేసింది. దాతలు సహకారం అందితే ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది.

పెళ్లి తిరస్కరించి..

యాలాల మండలం ముద్దాయిపేట తండాకు చెందిన లక్ష్మి (2024–25) పదో తరగతిలో 535 మార్కులతో మండల రెండో స్థానంలో నిలిచింది. నాన్న దుబాయిలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధం తిరస్కరించి ఇంటర్మిడియెట్‌ చదువుతోంది.

మండలంలో రెండో స్థానం..

మండల పరిధిలోని సీత్యానాయక్‌ తండాకు చెందిన నందిని (2025–26) పదో తరగతిలో 529 మార్కులు సాధించింది. మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచి ఆశ్రమ పాఠశాల పేరు నిలబెట్టింది. గురుకులాల్లోని సీఓఈ కళాశాలకు వెళాల్లని ఎదురుచూస్తోంది.

తల్లి కష్టం తెలిసి..

ప్రశాంతి నాన్న హోంగార్డుగా పని చేస్తూ పదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తాను చదువుతున్న ఆశ్రమ పాఠశాలలో తల్లి మణెమ్మ వంట మనిషిగా చేస్తోంది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 527 మార్కులతో ఆశ్రమ పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. ఇలా అనేక మంది పేద విద్యార్థినులు ఆశ్రమ పాఠశాలల్లో చదివి ఉత్తమ ఫలితాలు సొంతం చేసుకున్నారు.

మండల టాపర్లుగా నిలుస్తున్న గిరిజన బిడ్డలు

కన్నవారి కలలను సాకారం చేస్తున్న బాలికలు

ఎంబీబీఎస్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో రాణిస్తున్న వైనం

లక్ష్యం నెరవేరుతోంది

జిల్లాలోని బొట్లోనితండా బాలికల ఆశ్రమ పాఠశాల పదో తరగతి ఫలితాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. చదువుకు దూరమైన సంచార, గిరిజన విద్యార్థులను వృద్ధిలోకి తీసుకరావాలన్నదే గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యం. ఆ కళ నేడు సాకారమవుతోంది. ఉపాధ్యాయులు చక్కగా బోధన చేయడం కలిసివస్తోంది. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.

– కమలాకర్‌రెడ్డి,

డీటీడీఓ, వికారాబాద్‌

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు చక్కటి వేదికలవుతున్నాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలు. వీటిలో చదువుతున్న చెంచు, లంబాడా, ఎరుకల తెగకు చెందిన విద్యార్థినులు ఏటా మండల టాపర్లుగా సత్తా చాటుతున్నారు. గతంలో ఉత్తీర్ణులైన పలువురు పై చదువులు పూర్తి చేసి ప్రస్తుతం ఉన్నత కొలువుల్లో స్థిరపడ్డారు

Advertisement
 
Advertisement
Advertisement