● వైఖానస శాస్త్రోక్తంగా పనులు
● హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
● పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు
కొడంగల్: పట్టణంలోని బాలాజీ నగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఎండోమెంట్ కమిషనర్ హన్మంత్ రావ్ సోమవారం పరిశీలించారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విస్తరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి దైవిక కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు.
రూ.110 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం
శ్రీవారి ఆలయాన్ని రూ.110 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పనులు చేపడుతున్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలకు పాటిస్తూ రెండేళ్లలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులు, ఆలయ నిర్మాణ స్తపతులు, ఆలయ నిర్మాణ శిల్పులు భవిష్యత్ ఆలయానికి రూపకల్పన చేశారు. ఆలయాన్ని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. తిరుమల తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ గుప్త, ఈఓ రాజేందర్‌రెడ్డి, ఎండోమెంట్, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, హౌసింగ్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


