షాద్‌నగర్: ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్ ఆరోపించారు. సోమవారం ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రదేశాన్ని శ్రీనునాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఫిబ్రవరి నుంచి నేటి వరకు వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా కూలీలకు ప్రతి వారం పేస్లిప్పులు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం య థావిధిగా కొనసాగించాలని, కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కూలీలకు వేతనాలు, పని దినాలు పెంచాలన్నారు. అదేవిధంగా పని ప్రదేశంలో రోజుకు రెండు పూటలా ఫొటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


