తాండూరు రూరల్: మండలి చీఫ్ విప్ ఆదివారంలో తాండూరు పట్టణంలో పర్యటించారు. పట్టణంలో పలు వివాహా వేడుకలు, శుభకార్యాల్లో ఆయన పాల్గొన్నారు. అంతారం గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ కుమార్తె వివాహం పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. హాజరైన పట్నం మహేందర్‌రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించారు.
దుద్యాల్: ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధం అయింది. ఈ సంఘటన మండల పరిధి పోలేపల్ల అనుబంధ గ్రామమైన పల్లెగడ్డలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తడకలి కృష్ణయ్య ఎప్పటిలాగే తన పొలం వద్ద ఉన్న షెడ్డులో రెండు ఆవులు, రెండు దూడలను కట్టేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 7 గంటలకు పాకలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన సమీప రైతులు.. వెంటనే పాకలోని ఆవులు, దూడలను కాపాడారు. కానీ అప్పటికే వాటికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయి. అనంతరం 25 కిలో మీటర్ల దూరంలోని కొడంగల్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. సిబ్బంది వచ్చేలోగా కొట్టం కాలి బూడిదయింది. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కృష్ణయ్య కోరారు. కాగా.. పాక ప్రమాదవశాత్తు తగల బడిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
విజయనగర్‌కాలనీ: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎస్సై దయానంద్ తెలిపిన వివరాల ప్రకారం..... ఆసిఫ్‌నగర్ శ్యామ్‌నగర్ నమ్మక్ కార్ఖానా వద్ద శ్రీను (45) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 1న అర్ధరాత్రి మద్యం సేవించి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అందరూ నిద్రిస్తుండగా మద్యం మత్తులో ఉన్న అతడు నీటి సంపు వద్దకు వచ్చి నీటిని తోడుతుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వారు వచ్చి పరీక్షించగా మృతి చెందినట్లు నిర్ధాంచారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హయత్‌నగర్: ముందుగా వెళ్తున్న వాహనాలు సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మూడు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన ఆదివారం హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్ బస్టాండ్ వద్ద ముందుగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ సడెన్ బ్రేకు వేశాడు. దాని వెనుకనే ఉన్న పల్లె వెలుగు బస్సు డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేశాడు. ఆ బస్సు వెనుకనే ఉన్న ఎలక్ట్రిక్ బస్సు పల్లె వెలుగు బస్సును ఢీ కొట్టింది. ఆ బస్సును దాని వెనకున్న మరో ఎలక్ట్రిక్ బస్సును ఢీ కొట్టింది. ఈ ఆ బస్సుల్లోని పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సుల వేగం తక్కువగా ఉండడంతో పె ద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
గన్‌ఫౌండ్రీ: ఏఐసీసీ అగ్ర నాయకుడు, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దూరదర్శన్ యాంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఢిల్లీకి చెందిన దూరదర్శన్ యాంకర్ అశోక్ ఇటీవల రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు నిఖిల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది రోజుల క్రితమే బేగంబజార్ పోలీసులు యాంకర్‌పై కేసు నమోదు చేసి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని... అవసరమైతే అశోక్‌ను తీసుకురావడానికి ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ఆదివారం ఇన్‌స్పెక్టర్ భరత్‌కుమార్ తెలిపారు.


