బతికుండగానే చనిపోయిందని..
ఇద్దరి మహిళల పేర్లు ఒక్కటే కావడంతో ఒకరి భూమి మరొకరికి..
బ్యాంక్ లోన్ రెన్యూవల్‌కు వెళ్లగాఅసలు విషయం వెలుగులోకి..
రెవెన్యూ అధికారుల తీరుపై బాధితురాలి ఆగ్రహం
న్యాయం చేయాలని తహసీల్దార్‌కు మొర
యాలాల: పట్టాదారు బతికుండగానే చనిపోయిందని నిర్దారించి ఆమె భూమిని మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు రెవెన్యూ అధికారులు. గ్రామంలో ఇద్దరు మహిళల పేర్లు ఒక్కటే కావడంతో బతికున్న మహిళ భూమిని చనిపోయిన మహిళ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. రెవెన్యూ అధికారుల తీరుపై నిజమైన వారసురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి తహసీల్దార్‌ను కోరింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని పగిడిపల్లిలో అప్తగిరి సాయమ్మ పేరిట ఇద్దరు మహిళలు ఉండగా 2019లో కరోనాతో ఓ మహిళ చనిపోయింది. ఆమె పేరిట గ్రామ సర్వే నంబర్ 614లో 3 ఎకరాల భూమి ఉంది. బతికున్న అప్తగిరి సాయమ్మ పేరిట సర్వే నంబర్ 614/1లో 3 ఎకరాలు, మరో సర్వే నంబరు 573/2/5లో 4 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అయితే చనిపోయిన సాయమ్మ కుటుంబ సభ్యులు ఆమె డెత్ సర్టిఫికెట్ ఆధారంగా గతేడాది విధుల్లో ఉన్న తహసీల్దార్ ద్వారా తనకు చెందిన ఏడెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితురాలు అప్తగిరి సాయమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
బయటపడిందిలా..
అప్తగిరి సాయమ్మ తన పేరున ఉన్న భూమిపై గతంలో జుంటుపల్లిలోని యూనియన్ బ్యాంక్‌లో రూ.1.60 లక్షల పంట రుణం తీసుకుంది. రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు ఆమెకు సూచించారు. రెన్యూవల్ ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్‌లో ఈసీ, 1బీ, పహాణీ కాపీలు తీసుకునేందుకు సోమవారం వెళ్లింది. తన పేరు రికార్డుల్లో లేనట్లు గుర్తించింది. వెంటనే కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపింది. అనంతరం తహసీల్దార్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందించింది.
విచారణ చేపడతాం
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆర్‌ఐను విచారణకు ఆదేశించా. పట్టాదారుల ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఇలా జరిగిందా.? లేదా ఇంకా ఎదైనా కారణాలతో జరిగిందా అనేది విచారణలో తేలుతుంది. గతంలో జరిగిన విరాసత్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తా.
– వెంకటస్వామి, తహసీల్దార్ యాలాల
భూమి అక్రమ రిజిస్ట్రేషన్


