రాష్ట్రస్థాయి క్రీడల్లో మెరిసిన పోలీసులు
అనంతగిరి: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జిల్లా పోలీసులు సత్తాచాటారు. ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 15 పతకాలను సొంతం చేసుకున్నారు. ఇటీవల సైబరాబాద్ వేదికగా 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ –2026 జరిగింది. జిల్లాకు చెందిన పొలీసు క్రీడాకారులు చార్మినార్ జోన్ తరఫున పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం ఎస్పీ స్నేహ మెహ్ర అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన పోలీసులు వివిధ విభాగాల్లో ఒక గోల్డ్, ఏడు సిల్వర్, ఏడు బ్రాంజ్ మెడల్స్ సాధించారని తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో కె.స్వాతి హైజంప్‌లో బంగారు పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. బాడ్మింటన్ డబుల్స్‌లో డీసీఆర్బీ సీఐ నవీన్ కుమార్, వెయిట్ లిఫ్టింగ్(60కిలోల విభాగం)లో కె.స్వాతి, ఆర్మ్ రెజ్లింగ్(100కిలోల)లో బి.నర్సింహులు, ఆర్మ్ రెజ్లింగ్(85 కిలోలు)లో మహేందర్, ఆర్మ్ రెజ్లింగ్ (60కిలోలు), తైక్వాండో 60కిలోల విభాగంలో శ్రీనివాస్, బాక్సింగ్(65కిలోలు)లో రెహమతుల్లా వెండి పతకాలు సాధించారని తెలిపారు. ఆర్మ్ రెజ్లింగ్(65కిలోలు)లో బి.కావ్య, ఆర్మ్ రెజ్లింగ్(55కిలోలు)లో స్వాతి, వాటర్ స్పోర్ట్స్ (కనోయింగ్ 200 మీటర్లు)లో మన్సూర్, స్విమ్మింగ్(100 మీటర్లు)లో రవీందర్, హ్యామర్ త్రోలో జై ఆనంద్, బాక్సింగ్(70కిలోలు)లో ప్రకాష్ కాంస్య పతకాలు సాధించారని పేర్కొన్నారు. మహిళల ఖోఖో జట్టు (3వ స్థానం) నిలిచిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ ఆర్‌ఐ డేవిడ్ విజయ్ కుమార్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


