తప్పదు వేటు!
వివరాలు ఇవ్వాల్సిందే..
మున్సిపల్ ఎన్నికల ఖర్చు చెప్పాల్సిందే..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో వంద వార్డులకు గాను 98 వార్డులకు ఎన్నికల జరిగాయి. 341 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా ఖర్చుకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు జరిగిన 45 రోజుల వ్యవధిలో లెక్కలు చూపించాలని ఎన్నికల సంఘం గడువు విధించింది. ఎన్నికల్లో టీ, టిఫిన్, ప్రకటనలు, నమూనా బ్యాలెట్, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ప్రచార రథాలు, డ్రైవర్ల బత్తా, భోజనం, మైక్‌సెట్ ఇలా ప్రతి దానికీ ఎన్నికల సంఘం విధించిన పరిమితి దాటకుండా లెక్కలు చూపాల్సి ఉంటుంది. నామినేషన్లు పర్వం మొదలు ప్రచారం పూర్తయ్యే వరకు రోజువారీ లెక్క చెప్పాల్సిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల వ్యయవివరాలు మున్సిపాలిటీల్లో విధిగా అధికారులకు సమర్పించాల్సి ఉంది. చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఇప్పటికీ లెక్కలు ఇవ్వలేదు. ఖర్చు వివరాలు అందించకుంటే గెలిచినవారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఓడినవారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు. కొత్తగా బరిలో నిలబడిన వారు సీనియర్ల సలహాలతో వివరాలు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఓట్ల కోసం నోట్ల వర్షం
మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు ఎన్నికల సంఘం రూ.లక్ష మాత్రమే ఖర్చు చేయాలన్న నిబంధన విధించింది. బరిలో నిలిచిన అభ్యర్థులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రూ.కోట్లు కుమ్మరించినట్లు ప్రచారం జరుగుతోంది. నిఘా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసినా రోజువారీ ప్రచారాలు నిర్వహించిన తర్వాత మద్యం పంపిణీ షరా మామూలుగానే కొనసాగింది. పోలింగ్‌కు ముందు రోజు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు నగదు, నజరానాలు అందించారు. అధికారులకు సమర్పించే లెక్కలు మాత్రం రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు మించకుండా చూపించేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
మున్సిపాలిటీల వారీగా ఇలా..
మున్సిపాలిటీ వార్డులు బరిలో నిలిచిన
అభ్యర్థులు
వికారాబాద్ 34 112
పరిగి 18 60
కొడంగల్ 12 34
తాండూరు 36 135
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోటీలో నిలబడిన అభ్యర్థులంతా ఎన్నికల ఖర్చు లెక్క చెప్పాలి. ఫలితాలు విడుదలైన రోజు నుంచి 45 రోజుల్లో వివరాలు అందించాలని ఈసీ గడువు విధించింది. విధిగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి.
– సుధీర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)
తప్పదు వేటు!


