విద్యార్థుల చేతిలో దేశ భవిష్యత్
తాండూరు రూరల్: దేశ నిర్మాణంలో సాందీపని గురుకుల విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషిస్తారని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. మండల పరిధిలోని జినుగుర్తి శివారులోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌లో ఆదివారం సాందీపని గురుకుల పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస వర్మ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి పాఠశాల హాస్టల్ భవనం, అడ్మినిస్ట్రేట్ భవన సముదాయం, స్కిల్ డెవలప్‌మెంట్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సాందీపని గురుకుల పాఠశాలలో ఆధునికతను జోడించి కార్పొరేట్ విద్యనందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులను వేదవిద్యలో పండితులుగా తీర్చిదిద్దడంతో పాటు, ఆధునిక ప్రపంచాన్ని ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేస్తోందన్నారు. పాఠశాలకు ఎల్లవేళలా తాను సాయమందిస్తామన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. వంద ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారం రసాయనాలు కలిసి కలుషితమవుతోందన్నారు. ఎలాంటి రసాయనం లేకుండా గో ఆధారిత వ్యవసాయంతో పంటలు, కూరగాయలు పండించడం అభినందనీయన్నారు. అనంతరం విద్యార్థుల చేపట్టిన మల్లఖంబ విన్యాసం చూపరులను ఆకట్టుకుంది. యోగా, నృత్యాలు, భగవద్గీత పారాయణం చేశారు. ఈ వార్షికోత్సవంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు, సిలికాన్ ఫౌండర్ కుచిబొట్ల ఆనంద్, చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకారిణి భాగయ్య, మాజీ ఐఏఏస్ సతీశ్‌చంద్ర, ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ పీవీ రావు, మున్సిపల్ చైర్మన్ నీరజ, జినుగుర్తి సర్పంచ్ శరణు పాల్గొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
సేంద్రియ వ్యవసాయం భేష్: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్
విద్యార్థుల చేతిలో దేశ భవిష్యత్


