నేడు ఈర్లపల్లిలో భూ సర్వే
తహసీల్దార్ కిషన్
దుద్యాల్: పారిశ్రామిక వాడలో కంపెనీల ఏర్పాటుకు ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలో సోమవారం భూ సర్వే చేపట్టనున్నట్లు తహసీల్దార్ కిషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈర్లపల్లి, సంట్రకుంట తండా, నన్య నాయక్ తండాల శివారులోని 362.23 ఎకరాల భూమి సేకరించేందుకు ముందస్తుగా సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. 88 సర్వే నంబర్‌లో 213.37 ఎకరాల అసైన్డ్ భూములను, 82, 89, 90, 91, 92, 93, 94, 95, 97, 98, 99, 100, 101, 102, 109 సర్వే నంబర్లలో 148.86 ఎకరాల పట్టా భూములకు సర్వే చేపడతామన్నారు. సంబంధిత సర్వే నంబర్లలో భూములున్న రైతులు దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలని సూచించారు.
జిల్లా సాంఘిక సంక్షేమ అసిస్టెంట్ అధికారి ప్రశాంత్
మోమిన్‌పేట/మర్పల్లి: విజ్ఞాన, విహార యాత్రలతో విద్యార్థులకు మనోవిజ్ఞానం లభిస్తుందని సాంఘిక సంక్షేమ జిల్లా సహాయ అధికారి ప్రశాంత్ పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మోమిన్‌పేట, సిరిపురం, మర్పల్లి, పట్లూర్ హాస్టల్ విద్యార్థులను ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చికి విహారయాత్రకు తీసుకెళ్లారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం వార్షిక పరీక్షలకు ముందు విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకెళ్లడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఓలు శుక్లవర్ధన్‌రెడ్డి, రవీందర్, తుల్జారాంగౌడ్, జైపాల్‌రెడ్డి, సుష్మ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. సోమవారం సాయంత్రం 5గంటలకు ఆలయం నుంచి బస్టాండు సమీపంలో ఉన్న పారువేట మండపం వరకు శ్రీవిశ్వక్సేన స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం పారువేట మండపంలో పుట్టమన్ను సేకరించి పుణ్యాహవచనం, మేఽధిని పూజ, అంకురార్పణ కార్యక్రమాలతో బాలాలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంబమవుతుందని చెప్పారు.
తాండూరు: తైక్వాండో చాంపియన్ మాస్టర్ దర్శన కోళి ఆదివారం తాండూరులో సందడి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో త్వైక్వాండో పోటీల్లో సత్తా చాటిన ఆమె పట్టణంలోని సహారా క్రికెట్ అకాడమిని సందర్శించారు. ఈ సందర్భంగా క్రికెట్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులను అభినందించారు. అనంతరం సహారా క్రికెట్ అకాడమి నిర్వాహకులు జగన్నాథ్‌రెడ్డి ఆమెను సన్మానించారు.
మొయినాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన గరుగు రాజు సొంత మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో వార్డు పరిధిలోని ఆడపిల్ల పెళ్లికి ‘రాజన్న భరోసా పథకం’ కింద రూ.51 వేలు అందజేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యారు. ఇచ్చిన హామీని ఆదివారం అమల్లోకి తెచ్చారు. మంగలి శాంతమ్మ రెండో కూతురు శిరీష వివాహ వేడుకకు హాజరై జీఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.51 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలను త్వరలోనే అమల్లోకి తెస్తామన్నారు.
నేడు ఈర్లపల్లిలో భూ సర్వే
నేడు ఈర్లపల్లిలో భూ సర్వే


