బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఇర్షాద్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఇర్షాద్‌పై దాడి

Feb 22 2026 8:41 AM | Updated on Feb 22 2026 8:41 AM

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌  ఇర్షాద్‌పై దాడి

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఇర్షాద్‌పై దాడి

అర్ధరాత్రి హైడ్రామా

తాండూరు టౌన్‌: తాండూరు మున్సిపల్‌ 7వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఇర్షాద్‌పై దాడి జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంట్లోకి పలువురు చొరబడి దాడికి దిగారు. గాయపడిన ఇర్షాద్‌ను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు. కోలుకున్న ఇర్షాద్‌ శనివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన బావమరిది అయాజ్‌, అతని మిత్రుడు సాబేర్‌ మరి కొంతమంది ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. కాగా అదనపు కట్నం కోసం తన భర్త ఇర్షాద్‌ తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని, తనను విచక్షణారహితంగా కొట్టి, చంపుతానని బెదిరించడం వల్లనే తన సోదరున్ని ఇంటికి పిలిచానని, అతనిపై తన సోదరుడు దాడి చేయలేదని ఇర్షాద్‌ భార్య అతియా చెబుతున్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం.

ఆటో బోల్తా పడి ఒకరి మృతి

పూడూరు: ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ మండలం కొత్రేపల్లికి చెందిన పుల్లని విజయ్‌కుమార్‌(38), పుల్లని రవి కుమార్‌, పల్గుట్ట భీంరావ్‌ ఆటోలో మన్నెగూడకు వెళ్లారు. అక్కడ గుల్షన్‌ హోటల్‌లో బిర్యాని తీసుకున్నారు. తిరిగి కొత్రేపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో ఎన్కేపల్లి సమీపంలో ఆటో బోల్తా పడింది. విజయ్‌మార్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విజయ్‌కుమార్‌ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు సోదరుడు పుల్లని రవికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

కేశంపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని కాకునూర్‌ గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బన్ని, రాజులు బైక్‌పై కేశంపేట నుంచి కాకునూర్‌ గ్రామం వైపునకు, కొత్తపేట గ్రామానికి చెందిన బాలాజీ కాకునూర్‌ నుంచి కేశంపేటకు స్కూటీ పైన వస్తుండగా కాకునూర్‌ శివారులో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

మీర్జాగూడలో

20 గొర్రెల చోరీ

చేవెళ్ల: గుర్తు తెలియని వ్యక్తులు మందలో నుంచి 20 గొర్రెలను అపహరించారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మీర్జాగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. గ్రామానికి చెందిన చనుగోముల యశ్వంత్‌ వద్ద సుమారు వంద గొర్రెలున్నాయి. ఎప్పటి మాదిరిగానే గొర్రెలను మేత కోసం బయటకు తీసుకెళ్లి గ్రామ సమీపంలోని షెడ్‌లో కొట్టి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మందలోకి వచ్చి 20 గొర్రెలను అపహరించారు. శనివారం ఉదయం గొర్రెల మంద వద్దకు వచ్చిన బాధితుడు చూడగా షెడ్‌ చుట్టూ వేసిన కంచెను కత్తెరించి ఉండటంతో పాటు 20 గొర్రెలు తక్కువగా ఉన్నాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement