ఎరువులు కీలకం | - | Sakshi
Sakshi News home page

ఎరువులు కీలకం

Feb 22 2026 8:41 AM | Updated on Feb 22 2026 8:41 AM

ఎరువు

ఎరువులు కీలకం

వినియోగంలో మెలకువలు తప్పనిసరి

లేదంటే దిగుబడి తగ్గే ప్రమాదం

సలహాలు తీసుకోండి

పంటలకు ఎరువులు వేసే సమయంలో సరైన అవగాహన లేకపోతే నష్టం తప్పదు. ఇది దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎరువుల వినియోగంపై ఏఈఓల సలహాలు, సూచనలు తీసుకుని, విధిగా పాటించాలి. పంట దిగుబడి పెంచుకునే మార్గాలను తెలుసుకోవాలి.

– నాగరాజు, ఏఓ

దుద్యాల్‌: యాసంగిలో సాగు చేసే పంటల్లో ప్రధానమైనది వరి. ఈపంట సాగులో ఎరువుల వినియోగం చాలా కీలకం. నాటు వేసే సమయంలో వేసిన ఎరువులు కాకుండా.. కలుపు తీయడానికి ముందు, తర్వాత అందించే ఎరువుల విషయంలో సరైన అవగాహ ఉండాలి. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఎరువులు పైరుకు సక్రమంగా అందుతున్నాయా.. లేదా..? అనేది రైతులు జాగ్రత్తగా గమనించాలి. యాజమాన్య పద్ధతులపై సరైన అవగాహన కలిగి ఉంటే తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇవి పాటించాలి

కాంప్లెక్స్‌ ఎరువులను దమ్ము సమయంలోనే వేయాలి.

పంట పొలంలో తగినంత తేమ లేకపోతే నత్రజని ఎరువులను వేయకూడదు. ఇలా వేస్తే పైరుకు పూర్తి స్థాయిలో పోషకాలు అందవు.

పొలాల్లో ఎరువులు వేసినప్పుడు రెండు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ నీళ్లు ఉండకుండా చూసుకోవాలి.

ఎరువులు చల్లిన తర్వాత రెండు రోజుల పాటు పొలంలో నీరు పెట్టకూడదు.

భాస్వరం ఎరువులను ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. లేదంటే ఈ ఎరువు ఎక్కడ వేస్తే అక్కడే ముద్దలాగా ఉండిపోతుంది. పంటకు పూర్తి స్థాయిలో అందదు.

వేసిన ఎరువులు మొక్కల వేరు భాగానికి అందేలా చూసుకోవాలి.

పైపొరలలో నిల్వ ఉంటే మాంగనీస్‌, జింక్‌, ఐరన్‌ లోపాలు తలెత్తుతాయి.

పోటాష్‌ ఎరువులను దమ్ములోనూ, చిరు పొట్ట దశలో వేసుకుంటే మంచిది.

పోటాష్‌ వేయడం వల్ల గింజనాణ్యత బాగుంటుంది. అలాగే పైరుకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నత్రజని ఎరువు భూమిపై పడితే అమోనియా రూపంలో ఆవిరైపోతుంది. తేమ ఎక్కువగా ఉంటేనే భూమి లోపలి పొరల్లోకి వెళ్తుంది.

ఎరువులు చల్లిన మరుసటి రోజు కలుపు తీస్తే తొక్కుడు పడి పంట మొక్కలకు ఎరువులు బాగా అందుతాయి.

సరైన తేమ లేకపోతే పొలాల్లో వేసిన ఎరువులు గడ్డ కట్టుకుపోయి, సరిగా పనిచేయవు.

నత్రజని, భాస్వరం, పొటాష్‌ తదితర ఎరువులు ఎప్పుడు వాడుకోవాలో సరైన అవగాహన కలిగి ఉండాలి.

ఎరువులు కీలకం 1
1/1

ఎరువులు కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement