అప్పుల పురం!
● శివారు మున్సిపాలిటీలోని ఓ వార్డులో పోటీ చేసిన అభ్యర్థి భూమి తాకట్టు పెట్టి రూ.1.50 కోట్లు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశాడు. ఓటర్లకు మద్యం, బిర్యానీ పంపిణీతోపాటు యువకులు, మహిళలకు వేర్వేరుగా విందు పార్టీలు ఏర్పాటు చేశాడు. ప్రచారంలో తిరిగిన ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి చొప్పున నగదు పంచాడు. చివరికి ఓటుకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేశాడు. ఫలితాల్లో మాత్రం భంగపాటు తప్పలేదు. ప్రత్యర్థి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన అప్పు కొండలా కనిపిస్తోంది.
● మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డులో అధికార పార్టీ ఆర్థికంగా బలంగా లేని అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. పోటీలో నిలవాలంటే డబ్బులు కావాల్సిందేనని భావించిన అభ్యర్థి ఉన్న ఒక్క ప్లాటును అమ్మేసి రూ.30 లక్షలు ఖర్చుపెట్టాడు. ఓటర్లు ఆదరించలేదు. ఫలితాల్లో మూడో స్థానం దక్కింది. పోటీ చేసి అనవసరంగా ఉన్న ప్లాటును అమ్ముకున్నానని ఇప్పుడు బాధపడుతున్నాడు.
● చేవెళ్ల నియోజకవర్గంలోని ఓ మున్సిపాలిటీలో అధికార పార్టీ టికెట్ కోసం ఓ అభ్యర్థి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ముందు నుంచి పార్టీలో ఉండి పనిచేసిన వ్యక్తికి కాకుండా.. తాను పార్టీ బీఫాం తెచ్చుకున్నాడు. ఇందుకోసం పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఏకంగా రూ.70 లక్షలు ముట్టజెప్పినట్లు ప్రచారం జరిగింది. సదరు అభ్యర్థి సుమారు రూ.4 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ చివరికి ఓటమిపాలయ్యాడు.
● నగరం చెంతనే ఉన్న ఓ మున్సిపాలిటీలో పార్టీ టికెట్ దక్కని ఓ అభ్యర్థి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాడు. గెలుపే లక్ష్యంగా రూ.కోట్లు కుమ్మరించాడు. ఓటుకు రూ.70 వేల వరకు పంచినట్లు ప్రచారంలో ఉంది. మొత్తంగా ఏకంగా రూ.7 కోట్లు వేచ్చించాడు. ఫలితాల్లో విజయం సాధించి వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్నాడు. అందుకోసం మరో రూ.4 కోట్లు ఖర్చుచేశాడని సన్నిహితులే చర్చించుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యర్థులు సైతం అదే స్థాయిలో ఖర్చుచేయడం విశేషం.
● జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో ప్రతిపక్ష పార్టీ టికెట్‌పై ఓ అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచాడు. గెలుపే లక్ష్యంగా రూ. 2 కోట్లు ఖర్చుపెట్టాడు. హోరాహోరీగా జరిగిన పోరులో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందాడు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన మొత్తాన్ని అప్పుగా తెచ్చాడు. ఓడిపోవడంతో తీర్చే మార్గం లేక ఎకరం భూమిని అమ్మకానికి పెట్టాడు.
ఓట్లకోసం.. కోట్లలో వెచ్చింపు ఆస్తులు తాకట్టుపెట్టి.. అప్పులు తెచ్చి ఖర్చు గెలిచినవారికి మోదం.. ఓడినవారికి ఖేదం తెచ్చిన అప్పులు కట్టలేక తిప్పలు
మొయినాబాద్: పురపాలిక ఎన్నికల్లో జిల్లాలోని అ న్ని మున్సిపాలిటీల్లో డబ్బుల వరద పారింది. బరి లో నిలిచిన అభ్యర్థులు తగ్గేదేలే అన్నట్లు ఒకరిని మించి ఒకరు ఖర్చుచేశారు. కొన్నచోట్ల నాలుగైదు ఓట్లు ఉన్న ఒక్కో ఇంటికి రూ.లక్షల్లో డబ్బు చేరింది.నగర శివారు ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికులు రియల్ వ్యా పారంతో సంబంధాలు ఉన్నవాళ్లే కావడంతో ఎక్క డా ఖర్చుకు వెనకాడలేదు. బలమైన అభ్యర్థులు పో టీ చేసిన ఒక్కో వార్డులో రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు ఖర్చుచేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఓట్లకోసం సుమారు రూ.300 కోట్లు అభ్యర్థులు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
అప్పుల ఊబిలో అభ్యర్థులు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సమయానికి డబ్బులు లేక అప్పటికప్పుడు భూమి, ఇళ్లు, ఆస్తులు, ఏదుంటే అది తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. తీరా ఫలితాలు వచ్చాక గెలిచినవారు ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు అప్పులు గుర్తుచేసుకుని బెంగపడుతున్నారు. ఓడిన అభ్యర్థులు మాత్రం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఓటమి నుంచి తేరుకోకముందే అప్పుల అనకొండ నెత్తిన కోరలుచాస్తోంది. కొందరు అప్పులు తీర్చడం కోసం భూమి, ఇళ్లు, ప్లాట్లు, ఇతర ఆస్తులు అమ్మకానికి పెడుతున్నారు.
మచ్చుకు కొన్ని..
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల వరద