
విదేశీ వాణిజ్య ఒప్పందం ప్రమాదకరం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏఎ)పై సంతకం చేయడమంటే అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాలకు లొంగిపోవడమేనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విమర్శించారు. గురువారం వికారాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్యామయ్య అధ్యక్షతన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు.. పరిష్కారాలు అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, పాడి, ఆహార, మార్కెట్ రంగాలకు ద్వారాలు తెరవడంతో దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు. కేంద్రం తీసుకున్న చర్యలను వ్యతిరేకించాలన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఉపాధ్యక్షులు మహిపాల్, సతీష్, లక్ష్మయ్య, వల్యనాయక జమాలొద్దీన్, అనసూయ లక్ష్మి, రాజు, బస్వరాజు, శ్రీనివాస్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.