
అక్రమార్కులపై కొరడా
తాండూరు రూరల్: ఎర్రరాయి తరలిస్తున్న అక్రమార్కులపై అధికారులు కొరడా ఝళిపించారు. పెద్దేముల్ మండలం తట్టెపల్లి, పాషాపూర్ తండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలపై శుక్రవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇద్దరు జేసీబీ డ్రైవర్లు, ఐదుగురు ట్రాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. సీఐ కథనం ప్రకారం.. పెద్దేముల్ మండలం అడికిచెర్ల, పాషాపూర్ తండా సమీపంలోని ప్రభుత్వ భూముల్లో కొందరు ఎర్రమట్టిరాయిని తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమాతులు లేకుండా ఎర్రమట్టి రాయిని ట్రాక్టర్ల ద్వారా కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇందులో జేసీబీ డ్రైవర్లు మన్నె ప్రవీణ్, రాథోడ్, ట్రాక్టర్ డ్రైవర్లు రాథోడ్ మోహన్, పెద్దేముల్ రవి, తల్వార్ శరణ్, చించోళి సుభాష్, మూర్తిలపై పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రెండు జేసీబీ, ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిరాయి అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల తండాకు చెందిన ఓ గ్రామస్థాయి మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్ల సహాయంతో కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎర్రరాయి తవ్వకాల అక్రమార్కులపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించడంతో తట్టెపల్లి, పాషాపూర్‌తండాలో కలకలం రేగింది.
ఎర్రరాయి తరలిస్తున్న వాహనాల పట్టివేత
ఏడుగురిపై కేసు నమోదు
పెద్దేముల్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు