
విద్యారంగ బలోపేతం.. ఎస్టీఎఫ్‌ఐ లక్ష్యం
షాద్‌నగర్: ప్రభుత్వ విద్యారంగం బలోపేతమే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్‌ఐ) లక్ష్యమని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నర్సింహులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయం ఆవరణలో ఫెడరేషన్ సీనియర్ నాయకుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన 25 సంఘాల టీచర్స్ యూనియన్లతో 2000 సంవత్సరంలో ఎస్టీఎఫ్‌ఐ ఏర్పడిందని తెలిపారు. విద్యారంగంలో శాసీ్త్రయ విధానాలను అనుసరించడం, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రస్తుతం ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని తగ్గించి రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను కాపాడాలని సూచించారు. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్రం తెచ్చిన ఎన్‌పీఎస్, సీపీఎస్, యూపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్,ఎన్‌ఈపీ 2020 విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఈ నెల 8న కలకత్తాలో రజతోత్సవ సభలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు సత్యం, లక్ష్మీ దేవమ్మ, రామకృష్ణ, వినీత్‌గౌడ్, శివ, రాజు, జేవీవీ నాయకులు కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.