
పాలమూరు పూర్తి చేస్తాం
పరిగి: ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయత్ర గురువారం పరిగి మండలం రంగాపూర్ నుంచి పరిగి పట్టణం వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేసిందన్నారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ బిల్లును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై కేంద్రంతో కొట్లాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పరిగి ప్రాంతం రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
సంక్షేమంలో మనమే ఆదర్శం
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. పట్టణంలో జనహిత పాదయాత్ర అట్టహాసంగా సాగింది. కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. పాదయాత్రలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, పార్టీ జిల్లా, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మండల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం పనిచేస్తుంది
పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటాం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ‘ప్రాణహిత– చేవెళ్ల’ను రద్దు చేసింది
జనహిత పాదయాత్రలో
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు