
నేటి నుంచి ఎస్‌జీఎఫ్ సెలక్షన్స్
సెప్టెంబర్ 4 వరకు కొనసాగనున్న పోటీలు
తాండూరు టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు పాఠశాలల విద్యార్థులకు పలు క్రీడల్లో జోనల్ లెవల్ ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. తాండూరు, పెద్దేముల్, కొడంగల్, పరిగి, వికారాబాద్ జోన్ల పరిధిలో ఈ ఎంపిక ఉంటుంది. తాండూరు, బషీరాబాద్, యాలాల మండలాలు తాండూరు జోన్ పరిధిలో ఉండగా, పెద్దేముల్ మండలం మాత్రం వికారాబాద్ జోన్ పరిధిలో ఉంది. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో అండర్ –14, –17 విభాగాల్లో బాలబాలికలు వేర్వేరుగా పోటీ పడనున్నారు. తాండూరు జోన్ పరిధిలో నేటి నుంచి క్రీడాకారుల ఎంపిక బషీరాబాద్‌లో ఉంటుందని జోనల్ సెక్రటరీ జె.అంబదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల ఎంపిక విషయాన్ని అన్ని పాఠశాలలకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు.
పారదర్శకత పాటించాలి
జోనల్ స్థాయిలో క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతున్నప్పటికీ జిల్లా, ఆపై స్థాయిల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నైపుణ్యం గల క్రీడాకారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.