
స్కిల్ డెవలప్‌మెంట్‌తో భవిష్యత్తు
మర్పల్లి: నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. గురువారం మండలంలోని పట్లూర్ గ్రామంలో పవర్ మేక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధునాతన మిషనరీ, కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఆ రంగాల్లో అనుభవం ఉన్న యువతకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. పవర్ మేక్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం డైరెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. తమ సెంటర్‌లో వెల్డింగ్, ఫిట్టర్, ఎలక్ట్రిషన్ తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కోర్సుల ఆధారంగా 30 నుంచి 90 రోజుల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. 8వ తరగతి పాస్ అయి ఉండి ఐటీఐ, లేదా ఇంటర్ పాస్ అండ్ ఫెయిల్ అయిన వారు శిక్షణకు అర్హులన్నారు. కార్యక్రమంలో పవర్ మేక్ ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ లక్ష్మి, పవర్ మేక్ ఫౌండేషన్ అధినేత కిషోర్ బాబు, ప్రిన్సిపాల్ విమల్ కుమార్, నందకిషోర్, ప్రభాకర్, భరత్ పురోహిత్, పట్లూర్ గ్రామస్తులు అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్