దోమ: కూతురు, కొడుకు మరణంతో పన్నెండేళ్లుగా మానసిక క్షోభను అనుభవిస్తున్న మహిళ పురుగు మందు మృతిచెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన దొబ్బలి మైబమ్మ(55) ఐదుగురు సంతానం. వీరిలో 12 ఏళ్ల క్రితం ఓ కుమార్తె, ఎనిమిదేళ్ల క్రితం ఓ కుమారుడు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె మానసిక వేదనతో కుంగిపోతోంది. ఇరుగుపొరుగు వారితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చునేది. ఈ క్రమంలో ఆదివారం ఆమె పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మైబమ్మ మృతి చెందారు. ఆమె కుమార్తె నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పురుగుమందు తాగిన మహిళ
చికిత్స పొందుతూ మృతి


