చరిత్రకు ఆనవాళ్లు.. అబ్బురపరుస్తున్న కళాఖండాలు

Symbols For Ancient Buddhist Culture And Traditions - Sakshi

చుంచుపల్లి: సంప్రదాయాలకు చిహ్నాలు.. పురాతన బౌద్ద సంస్కృతులు, వారి జీవన విధానాలు.. కళాత్మకమైన కట్టడాలే కాకుండా అపురూప శిల్పాలను చెక్కడంలో వారికి వారే సాటి లాంటి బౌద్దుల నైపుణ్య సృష్టికి ఆనవాళ్లుగా నిలిచాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కారుకొండ గుట్టలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి తరువాత కొత్తగూడెం కారుకొండపై 1860లో బౌద్దులు చెక్కిన అపురూప శిల్ప సంపద నేటికీ చెక్కు చెదరలేదు. వివరాల్లోకి వెళితే..  భారత పర్యటనకు వచ్చిన టిబెట్‌ బౌద్ద బిక్షువులు బౌద్ద మతాన్ని ప్రచారంలో భాగంగా మధ్యమధ్యలో ధ్యానం చేసుకునేవారు. దానికి వీలుగా కొన్ని గుహలను ఏర్పరుచుకొని ఆ ప్రాంతాల్లో అపురూప కళాఖండాలను తీర్చిదిద్దేవారు. 

ఆ నేపధ్యంలోనే కొత్తగూడెం కారుకొండ గుట్టపైకి పర్యటనకు వచ్చిన బౌద్దులు ప్రత్యేక గుహలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న గుహల్లోనే  30 నుంచి 40 రోజుల వరకు ధ్యానంలో గడిపేవారని ఇక్కడ చరిత్ర ఆనవాళ్ళు చెపుతున్నాయి.  ఆ గుట్టపైన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లపై బౌద్ద శిల్పాలు చెక్కినట్లు చరిత్ర చెపుతోంది. ఒకే బండరాయిపై బుద్దుడు పద్మాసనంలో కూర్చుని ద్యానం చేస్తున్న ప్రతిమలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. 

అలనాటి బౌద్దులు చెక్కిన అపురూప శిల్పాలను చూసెందుకు చుట్టుపక్కల గ్రామస్తులు గుట్టపైకి వెళ్తుంటారు. కొన్ని దశాబ్దాలుగా వీటిని పట్టించుకోకపోవడంతో అక్కడి శిల్పాలు శిధిలావçస్థకు చేరుకోవటంతో 1986లో ప్రముఖులు, గ్రామస్తులు వీటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 2016లో బౌద్ద గుహల వ్యవహారాలను పురావస్తు శాఖకు అప్పగించింది.  పురావస్తు శాఖాధికారులు కారుకొండ గుట్ట చుట్టూ ఇనుప వైరింగ్‌ ప్రహరీని ఏర్పాటు చేసి గుహలకు కొంత భద్రతను కల్పించారు. ప్రభుత్వం,పురావస్తుశాఖ కారుకొండ బౌద్ద గుహల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత ప్రాచుర్యంలోకి వచ్చే వీలుంది.
 

Read latest TS Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top