గరుడునిపై కల్యాణ వెంకన్న వైభవం | - | Sakshi
Sakshi News home page

గరుడునిపై కల్యాణ వెంకన్న వైభవం

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

గోవింద నామస్మరణలతో మార్మోగిన తుమ్మలగుంట జోరు వానలో నిలుచుని స్వామిని దర్శించిన భక్తులు 70 వేల మందికిపైగా భక్తులు వచ్చినట్లు అంచనా ఉదయం మోహినీ అవతారంలో కల్యాణ వెంకన్న పల్లకీ సేవ

తిరుపతి రూరల్‌: గోవింద నామస్మరణతో తుమ్మలగుంట మార్మోగింది. తిరుపతి రూరల్‌ మండలం, తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. గరుడునిపై కొలువుదీరిన స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, వీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి.

జోరు వానలో.. గరుడోత్సవం

కల్యాణ వెంకన్నకు అత్యంత ప్రీతికరమైన గరుడవాహన సేవను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. గరుడ వాహనంపై స్వామివారు విహరిస్తుండగా భక్తులు గోవింద నామస్మరణతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన గరుడోత్సవానికి 70 వేల మందికిపైగా భక్తులు తరలి వచ్చినట్లు అంచనా. గరుడవాహన సేవకు తుమ్మలగుంట గ్రామ శివార్లలోని ఆమోగ్య, శరీనా గ్రాండ్‌, ఎస్‌ఎల్‌వి సన్నిధి, వెంకటాద్రి, లోటస్‌, సమస్ర అపార్ట్‌మెంట్‌ వాసులు సారె తీసుకువచ్చి స్వామికి సమర్పించారు.

మోహినీ అవతారంలో కల్యాణ వెంకన్న

బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం కల్యాణ వేంకటేశ్వరుడు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకరణలతో పల్లకీపై కొలువుదీరిన స్వామి వారిని పుర వీధుల్లో ఊరేగించారు. తుమ్మలగుంట గ్రామంలోని రేషన్‌ షాపు వీధి, శ్రీలక్ష్మీనగర్‌, పడమటి వీధి, చిట్టపాలెం వీధులకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చి సమర్పించారు. గరుడోత్సవంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement