నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వేలాది మంది యువతీయువకులు జిల్లాలో ఏటా కొత్తగా సుమారు 15వేల మంది పట్టభద్రులు | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వేలాది మంది యువతీయువకులు జిల్లాలో ఏటా కొత్తగా సుమారు 15వేల మంది పట్టభద్రులు

Aug 31 2026 12:14 AM | Updated on Aug 31 2026 12:14 AM

● ఉపాధి కోసం తప్పని ఎదురుచూపులు ● ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరాశతో నిట్టూర్పులు ● జాబ్‌ క్యాలెండర్‌ పేరిట చినబాబు సన్నాయి నొక్కులు ● చేసేదిలేక పొరుగు రాష్ట్రాలకు వలసలు

● ఉపాధి కోసం తప్పని ఎదురుచూపులు ● ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరాశతో నిట్టూర్పులు ● జాబ్‌ క్యాలెండర్‌ పేరిట చినబాబు సన్నాయి నొక్కులు ● చేసేదిలేక పొరుగు రాష్ట్రాలకు వలసలు

తిరుపతి సిటీ : కోటి ఆశలతో రూ.లక్షలు ఖర్చుపెట్టి ఉన్నత విద్యను చదివిన యువత పరిస్థితి దయనీయంగా మారుతోంది. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. యూజీ, పీజీలు పూర్తి చేసి సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందకపోవడంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పక్కరాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. చదివిన చదువుకు సరిపడా పోస్టు లభించకపోవడం, బాబు సర్కార్‌ ఉద్యోగాల భర్తీపై శీతకన్ను వేయడంపై యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత వాతావరణంలో ఉన్నత విద్యనభ్యసించే వారి సంఖ్య భారీగా పడిపోనుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

వేల సంఖ్యలో వలస

దేశంలో 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వారిలో సుమారు 8కోట్ల మంది ఖాళీగా ఉన్నారని ఇటీవల నీతి అయోగ్‌ విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇదే తరహా పరిస్థితి తిరుపతి జిల్లాలోనూ కొనసాగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుపేద యువతకు ఉపాధి లభించడం కష్టతరమవుతోంది. దీంతో జిల్లా నుంచి కర్ణాటక, చైన్నె, హైదరాబాదు వంటి నగరాలకు యువత వలస వెళ్లాల్సి వస్తోంది. ఉన్నత చదువులు చదివిన వారు సైతం కేవలం రూ.12వేల వేతనానికి ఆ నగరాలలో పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా నుంచి గత రెండేళ్లుగా భవననిర్మాణ రంగంలో ఉపాధి కోసం 22వేల మంది, పలు కంపెనీలలో చిరు ఉద్యోగాలకోసం 12వేల మంది యువత వలసబాట పట్టినట్లు సమాచారం.

భృతి లేదు

జిల్లాలో లక్షలాది మంది యువత ఎంతో ఆశతో ఎదురు చూసిన నిరుద్యోగ భృతికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా ప్రతి వ్యక్తికి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3వేలు ఇస్తామన్నా హామీని తుంగలో తొక్కేసింది. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి జాబ్‌మేళాలను నిర్వహించి ఉపాధి కల్పిస్తామని ప్రగల్భాలు పలికి చేతులెత్తేసింది. తూతూమంత్రంగా జాబ్‌మేళాలు నిర్వహించి ప్రైవేటు కంపెనీలలో దిగువ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే సదరు జాబ్‌మేళాలపై యువత ఆసక్తి చూపడం లేదు.

హామీ.. ఊసే లేదు

చంద్రబాబు ఎన్నికల సమయంలో యువత ఓట్లు దండుకునేందు ఏటా 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రగల్భాలు పలికారు. కానీ, అధికారం చేపట్టి రెండేళ్లు పూరైనా ఇప్పటి వరకు మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన పోస్టులు తప్ప యువతకు చేసింది ఏమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో తూతూ మంత్రంగా పలు పోస్టులకు నోటిఫికేషన్‌ వదిలి చేతులు దులుపుకున్నారు. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే కేవలం వందల సంఖ్యలో పోస్టులను సైతం విడుదల చేయకపోవడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

చొరవ తీసుకోని ప్రభుత్వం

జిల్లాలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులను మినహా ఇస్తే బీటెక్‌ వంటి టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులతో పాటు సాధారణ డిగ్రీలు పూర్తి చేసే వారి సంఖ్య సుమారు 8వేల మందికి పైగా ఉంటోంది. అలాగే ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌ఎస్‌, ఏంఏ, ఎంకామ్‌తో పాటు పలు రకాల పీజీ కోర్సులు, పీహెచ్‌డీలు పూర్తి చేసే వారి సంఖ్య ఏడాదికి 6 నుంచి 7వేల మంది ఉంటున్నారు. అంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఏటా సుమారు 15వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకోకపోవడంతో మొత్తం 15వేల మంది నిరుద్యోగులు ఉపాధి కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement