తిరుపతి కల్చరల్: ప్రకృతికి అనుగుణంగా జీవించడం, సహజ ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు తెలిపారు. ఆయుష్ శాఖ, టీటీడీ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రం వేదికగా చేపట్టిన యోగా, ప్రకృతి వైద్యంతో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సు ఆదివారంతో ఘనంగా ముగిసింది. సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, తగినంత విశ్రాంతి లేకపోవడం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయన్నారు. సహజ ఆహారం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, తగినంత విశ్రాంతి ఆరోగ్య సంజీవనిలోని నాలుగు ముఖ్య అంశాలని వెల్లడించారు. మంచి జీవన అలవాట్లు పాటిస్తే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చన్నారు. బెటర్ లివింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డిజిటల్ వెల్‌నెస్ ఉపాధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలను సమతుల్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. సానుకూల ఆలోచనలు, ప్రశాంతమైన మనసు, ఆనందమయ జీవితానికి బలమైన పునాదులని చెప్పారు. ప్రతి రోజూ యోగా, ధ్యానం, వ్యాయామానికి సమయం కేటాయించడంతో పాటు ప్రకృతితో మమేకం కావాలన్నారు. తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. మహతి ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి ఆరోగ్య వస్తువుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈఓ ఆనందరాజు, ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు పాల్గొన్నారు.


