విజయపురం (నగరి): రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు.. కూటమి ప్రభుత్వం అలవిగాని హామీలతో నమ్మించి మోసంచేసిందని తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందడం లేదని వారికే ఆత్మపరిశీలనలో అర్థమైంది. గత ఎన్నికల్లో తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదని తెలుసుకున్నారు. ప్రజలను నమ్మించి వంచించిన పార్టీలో ఇక ఉండకూడదని నిర్ణయించారు. అన్ని వేళలా ప్రజలకు అండగా నిలిచే మాజీ మంత్రి ఆర్కే రోజాను బలపరచాలని, మళ్లీ జగనన్ను ముఖ్యమంత్రిని చేసుకొని ప్రజలు కోరుకునే సంక్షేమ పాలనను తెచ్చుకోవాలని టీడీపీని వదిలిపెట్టారు. ఆదివారం చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం, శ్రీహరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి ఆర్కేరోజా సమక్షంలో గ్రామానికి చెందిన టీడీపీ నేత ప్రకాష్ అతనితో పాటు పలువురు పార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మాజీ మంత్రి కండువాలు వేసి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన నాయకులతో కలసివుంటూ పార్టీ ఉన్నతికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉన్న అంచనాలు.. ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు తమకు రాజకీయ వాస్తవాలను తెలియజేశాయని పేర్కొన్నారు. గ్రామాలకు తాగునీటి వసతి లేదని, విద్యుత్ సరఫరా ఉండడం లేదని, రోడ్లు బాగాలేవని.. ఏ సమస్యా పరిష్కారం కాలేదన్నారు. ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వ హయాంలో అమలైన కార్యక్రమాలతో పోల్చుకుంటూ గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను గమనించిన అనంతరం తాము చేసిన తప్పును గుర్తించామని అందుకే టీడీపీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసి సంక్షేమ పాలన తీసుకురావడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పార్టీలో చేరిన వారిలో కార్తిక్, నాగరాజు, గోపి, ప్రసాద్,పరంధామ, కిషోర్, రమేష్, సురేష్, శరత్, మహేష్, మునిలక్ష్మి, మదు, సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శివరాజు, నాయకులు గుణశేఖర్‌రెడ్డి, గోవర్దన్ నాయుడు, శేఖర్‌రాజు, భాస్కర్‌రెడ్డి, శ్రీరాములు రెడ్డి, ప్రసన్నకుమార్, దిలీప్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


