సీఎం ఆదేశాలు బేఖాతర్
వరదయ్యపాళెం: పిచ్చాటూరు మండలం.. కారూరు ప్రాంతంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. జాతీయ రహదారి పనుల పేరుతో అనుమతులు తెచ్చుకుని, కోట్ల విలువైన గ్రావెల్‌ను తమిళనాడు ప్రైవేట్ కంపెనీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. అధికార పార్టీ నేతలు జేబులు నింపుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సీఎం ఆదేశాలు గాలికి
ఇటీవల శ్రీసిటీ పర్యటనలో సీఎం చంద్రబాబునాయుడు ‘సత్యవేడు నుంచి తమిళనాడుకు తట్ట మట్టి కూడా వెళ్లకూడదు’ అని హెచ్చరించారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే ఆ ఆదేశాలు ప్రచారానికే పరిమితమయ్యాయని స్పష్టమవుతోంది. సీఎం చెప్పి న కొద్ది రోజుల్లోనే పిచ్చాటూరు మండలం, కారూరు నుంచి రాత్రిపగలు తేడాలేకుండా వందల టిప్పర్లు తమిళనాడు వైపు పరుగులు తీస్తున్నాయి. అంటే అధికారులకు సీఎంపై భయం లేదా?.. లేక అధికార పార్టీ పెద్దల అండతోనే ఈ దందా సాగుతోందా..? అని ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
అనుమతులు దేనికి.. అమ్ముకుంటోంది ఎక్కడికి?
లెక్కల ప్రకారం గ్రావెల్ తవ్వకం జాతీయ రహదారి పనుల కోసం మాత్రమే. కానీ వాస్తవంలో ఆ గ్రావెల్ చైన్నె, తిరువళ్లూరు, ఊత్తుకోట్టై ప్రాంతాల్లోని ప్రైవేట్ లేఅవుట్లు, వెంచర్లు, కంపెనీలకు వెళ్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక లక్షల రూపాయల అక్రమ లాభాలు ఉన్నాయని, అందులో అధికార పార్టీ నేతలకు వాటాలు వెళ్తున్నాయనే చర్చ సత్యవేడు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. గతంలోనూ ఇదే పరిస్థితి జరిగేదని.. అయితే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మరళా యథావిధిగా మాఫియా ఆట మొదలెట్టిందని సర్వత్రా చర్చ జరుగుతోంది.
రోడ్లన్నీ ఛిద్రం
ఓవర్ లోడ్ టిప్పర్లతో పిచ్చాటూరు, సత్యవేడు రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, రవాణా, పోలీసు శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే తనిఖీలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సంపదను దోచుకునేందుకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చినట్లుగా వ్యవహారం ఉందని, వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సత్యవేడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


