తిరుమల: తిరుమలలో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద క్వాడ్రుపెడ్ రోబోట్ (నాలుగు కాళ్ల రోబోట్ డాగ్) పనితీరును టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఈ రోబోట్‌ను వినియోగించే అవకాశాలపై వివరాలు తెలుసుకున్నా రు. ఈ రోబోట్‌లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉటుందని, వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. రోబోట్‌లోని ఆర్ట్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. అలిపిరి–తిరుమల కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడంతోపాటు, అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు.


