ఇంతవరకు అమలు చేయని సీఎం చంద్రబాబు
నేడు సత్యవేడులో హీరో పరిశ్రమ రెండో విడత గ్లోబల్ పార్ట్స్ యూనిట్‌కు భూమిపూజ
హామీల వరద ఇలా
వరదయ్యపాళెం: ‘హామీలు ఇస్తాం.. అమలు చేయం’ అన్నట్టుంది సీఎం చంద్రబాబునాయుడు తీరు. ఎన్నికల సందర్భంగా సత్యవేడు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం ఆయన మడమ తప్పేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక్క హామీనీ నెరవేర్చలేదు. నేడు హీరో పరిశ్రమ రెండో విడత గ్లోబల్ పార్ట్స్ యూనిట్ భూమి పూజ పేరుతో సత్యవేడు గడ్డపై అడుగుపెడుతున్న సీఎంకు పాత హామీలు గుర్తున్నాయా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2024 ఏప్రిల్ 20న సత్యవేడు గడియారం కూడలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిన వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి. పాత పరిశ్రమలు నూతన పెట్టుబడుల పేరిట భూమిపూజకు వస్తున్న సీఎం, పాత హామీలకు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.20 కోట్ల చెరుకు బకాయిలు ఎటుపోయాయి?
బీఎన్ కండ్రిగ మయూర షుగర్స్ కంపెనీ రైతులకు ఇవ్వాల్సిన రూ.20 కోట్ల బకాయిలు ఇప్పిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రెండేళ్లుగా రైతులు కన్నీళ్లు పెడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రోడ్లు లేవు
పరిశ్రమలకు తగ్గట్టు రోడ్లు వేస్తామన్నారు. తడ–శ్రీకాళహస్తి రోడ్డు, ఊత్తుకోట నుంచి సత్యవేడు మీదుగా కడూరు కూడలి వరకు నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఆ హామీ ప్రకటనలకే పరిమితమైంది. అటు శ్రీసిటీ, ఇటు ఏపీఐఐసీ సెజ్ పరిధిలో ఉన్న పరిశ్రమలకు రోజువారీ వేలాదిగా వెళ్లే కార్మికులు, ఉద్యోగులు ఇరుకు రోడ్లు, గుంతలమయంగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయలేక నరకం అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన దాసుకుప్పం బైపాస్ రోడ్డు పనులు సైతం అటకెక్కించారు.
ఎన్నికల్లో సత్యవేడు అభివృద్ధికి సవాలక్ష హామీలు


