రైతులంటే చంద్రబాబుకి ఇష్టం లేదు! | - | Sakshi
Sakshi News home page

రైతులంటే చంద్రబాబుకి ఇష్టం లేదు!

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

● పక్క రాష్ట్రంలో కిలో మామిడి రూ.17 ● ఇక్కడి ధరలు చూస్తే బాధేస్తుంది ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

● పక్క రాష్ట్రంలో కిలో మామిడి రూ.17 ● ఇక్కడి ధరలు చూస్తే బాధేస్తుంది ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఇష్టం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్ర మంత్రి ఉన్నా అక్కడి మామిడికి కిలో రూ.17లు మద్దతు ధర ఉందని గుర్తుచేశారు. ఇక్కడేమో కేవలం రూ.4 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్‌లోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువ శాతం మామిడి రైతులే ఉన్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు కూలీలకు కూడా రావని తేల్చిచెప్పారు. కనీస ధర అయినా ఇస్తే రైతులు నష్టాల నుంచి బయటపడుతారని తెలియజేశారు. రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్‌ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడం, బూడిద కూడా దొరక్కుండా చేయడం జరుగుతోందని ఆరోపించారు.

నేటి నుంచి

నాల్గో విడత ప్రవేశాలు

తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలలో భాగంగా అధికారులు నాల్గొవ విడత కౌన్సెలింగ్‌ కోసం మెరిట్‌లిస్ట్‌ను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఏ ఒక్క కళాశాలలోనూ కనీసం 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. ఇలా ఎన్ని విడతలు ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తారని, అధికారులు విద్యార్థులతో చలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి సీఎం పర్యటన

తిరుపతి అర్బన్‌: జిల్లాలో నేటి నుంచి సీఎం చంద్రబాబునాయుడు పర్యటించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ శారదాదేవి, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు సీఎం పర్యటన ఉంటుందని, ఏ అధికారికి అప్పగించిన బాధ్యత ఆ అధికారి వంద శాతం పూర్తి చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

హీరో పరిశ్రమలో

నేడు సీఎం పర్యటన

వరదయ్యపాళెం: సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం 4.20 గంటలకు సత్యవేడు మండలం, మదనపాళెంలోని హీరో మోటార్‌ కార్ప్‌ సంస్థ సైట్‌కు చేరుకోనున్నట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. సాయంత్రం 4.50 గంటలకు హీరో మోటార్‌ కార్ప్‌ సంస్థ రెండో గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఆయన శ్రీసిటీ గెస్ట్‌ హౌస్‌లో రాత్రి బస చేస్తారన్నారు.

7న ప్లాస్టిక్‌ బకెట్ల ఈ–వేలం

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించే ఖాళీ ప్లాస్టిక్‌ బకెట్లను జూలై 7న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్‌ ద్వారా ఈ– వేలం వేయనున్నారు. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల బిడ్డర్లు ఈఎండీ రూ.25 వేలు చెల్లించి ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877–2264429 నంబర్‌లో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ను సంప్రదించాలని సూచించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement