అంతా పరశురామేశ్వరునికే ఎరుక..! | - | Sakshi
Sakshi News home page

అంతా పరశురామేశ్వరునికే ఎరుక..!

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

● వివాదాస్పదంగా పురాతన గుడిమల్లం ఆలయ కలశాల తొలగింపు ● కలశాలలో వజ్ర వైఢూర్యాలు, కెంపులు, బంగారు ఆభరణాలు, నవరత్నాలు నిక్షిప్తం! ● తొలగించిన కలశాలు కనిపించకుండా చేయడంపై అనుమానాలు

● వివాదాస్పదంగా పురాతన గుడిమల్లం ఆలయ కలశాల తొలగింపు ● కలశాలలో వజ్ర వైఢూర్యాలు, కెంపులు, బంగారు ఆభరణాలు, నవరత్నాలు నిక్షిప్తం! ● తొలగించిన కలశాలు కనిపించకుండా చేయడంపై అనుమానాలు

గుడిమల్లం ఆలయం

అది 2600 ఏళ్ల నాటి ఆలయం.. ఫలితం కొంత మేర దెబ్బతినింది.. జీర్ణోద్ధర పేరుతో ఆలయ మరమ్మతులు చేపట్టారు.. ఆలయ గోపుర కలశాలు గోప్యంగా తొలగించారు.. అందులో ఏమున్నదీ బయట పొక్కనీయలేదు.. పురాతన కలశాలు కావడంతో అందులో నిధులు నిక్షిప్తం అయి ఉంటాయన్నది భక్తుల నమ్మకం.. అయితే నిర్వాహకులు ఏమీ లేవని బుకాయిస్తున్నారు.. అందులో ఏమున్నదీ ఆ పరశురామేశ్వరునికే ఎరుక అని భక్తులు అంటున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం.. 2600 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయంలో స్వయంభువుగా వెలసిన పరశురామేశ్వరుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఆలయ మహా కుంబాభిషేక మహోత్సవం పేరుతో 2600 ఏళ్ల కిందట ప్రతిష్టించిన ప్రధాన గోపుర కలశాల తొలగింపు వ్యవహారం ఆలయ పెద్దల మెడకు చుట్టుకుంది. కలశాలలో నిక్షిప్తమై ఉన్న ప్రతీదీ ఓ అమూ ల్యమైన బ్రహ్మపదార్థమేనన్న విశ్వాసం ప్రజల్లో ఉన్నప్పటికీ.. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన ఆలయ పెద్దలు నోరు మొదపడం లేదు. శ్రీకాళహస్తికి సమీపంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయం దేశంలోనే తొలి శివాలయంగా చరిత్రకెక్కడంతో కొన్నేళ్లుగా భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న ఈ చారిత్రక ఆలయంలో కొంత పైకప్పు వర్షాలకు ఉరుస్తుండడంతో ఆలయ ఈఓ, చైర్మన్‌ పురావస్తుశాఖ అనుమతులు తీసుకుని జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించడంతోపాటు ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ జీర్ణోద్ధరణ పనులను పూర్తి చేసి, గత నెల 19వ తేదీ నుంచి 23 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించారు.

వివాదంగా పాత కలశాల తొలగింపు

జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా రెండు వేల సంవత్సరా ల కిందటి ఆలయ ప్రధాన గోపురంపై ఉన్న మూడు కలశాలను తొలగించారు. అయితే వాటిని తొలగించిన తీరు, తొలగించిన తర్వాత కలశాల అవశేషాలను కూడా కంటికి కనిపించకుండా దాచిన విధానంపై భక్తలు నిర్ఘాంతపోతున్నారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించే పురావస్తుశాఖ ఆధీనంలో నడుస్తున్న ఈ ఆలయంలో చిన్న బండరాయికి మేకు కొట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు ఉన్న పరిస్థితుల్లో నిబంధనలు పాటించకుండా గుట్టుగా కలశాలను తొలగించి, అందులో సున్నం తప్ప మరేమీ లేదని, కలశాలు కూడా పొడి, పొడిగా మారాయని ఆలయ నిర్వాహకులు బుకాయించడంతో పెద్ద కుట్ర దాగి ఉందన్న అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తున్నారు. అప్పటి రాజుల కాలంలో నిర్మించిన ఆలయం కావడంతో వజ్ర వైఢూర్యాలు, కెంపులు, బంగారు ఆభరణాలు, నవరత్నాలు నిక్షిప్తం చేసి కలశాలకు విశేష శక్తిని చేకూర్చేలా అప్పట్లో నిర్మించి ఉంటారని భక్తులు విశ్వసిస్తున్నారు. అందువల్ల ఆలయ ప్రధాన గోపుర కలశాలతోపాటు, అందులో ఉన్న ప్రతీ పదార్థం వెలకట్టలేనిది. అయితే గుట్టుగా ఆలయ ఈఓ కూడా లేకుండా కలశాలను తొలగించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తొలగించిన కలశాల అవశేషాలను ఎక్కడ పడేశారన్న ప్రశ్నకు ఆలయ పాలకులు నీళ్లు నములుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement