ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ దాడి | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ దాడి

Mar 1 2026 7:21 AM | Updated on Mar 1 2026 7:21 AM

ఆర్డీ

ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ దాడి

రూ. 40 వేలు లంచం పుచ్చుకుంటూ

పట్టుబడిన సిబ్బంది

పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేశారు

దాన్ని పట్టా భూమిగా మార్చేందుకు లంచం

ఏసీబీ వలలో చిక్కిన ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది

సూళ్లూరుపేట: సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంపై శనివారం అవినితి నిరోధక శాఖ ఏఎస్పీ విమలకుమారి, డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పట్టణంలోని ఓ మెకానిక్‌ షాపును నిర్వహిస్తున్న ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా రూ.40 వేలు లంచం తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి, మరీ ముగ్గురిని పట్టుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వరదయ్యపాళెం మండలం సంతవేలూరుకు చెందిన హరినాథ్‌ అనే రైతుకు 99 సెంట్లు పట్టాభూమి అనువంశికంగా వారి పెద్దల నుంచి సంక్రమించి ఉంది. ఈ భూమిని ఆయన విక్రయించేందుకు రికార్డులు తీసుకునే క్రమంలో 66 సెంట్లు భూమిని పొరంబోకు భూమిగా రెవెన్యూ అధికారులు రికార్డుల్లో ఉండడంతో ఆయన ఇటీవల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కలెక్టర్‌ సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం, వరదయ్యపాళెం మండల రెవెన్యూ కార్యాలయాలకు పంపి, విచారించి న్యాయం చేయమని ఆదేశాలిచ్చారు. దీంతో బాధితుడు హరినాథ్‌ ఆయన కుమారుడు పూర్ణచంద్రరావు, ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించి గత కొంతకాలంగా తిరుగుతున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకి సీసీగా పనిచేస్తున్న హేమంత్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సిరాజ్‌ అనే ఇద్దరు కలిసి బాధితుడ్ని రూ.60 వేలు లంచంగా ఇస్తే నీ పనిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు అంత ఇచ్చుకోలేమని చెప్పి రూ.40 వేలకు బేరం కుదుర్చుకుని శనివారం ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఈ లంచం నగదు సూళ్లూరుపేట బస్టాండ్‌ సెంటర్‌లోని మెకానిక్‌ షాపు నడుపుతున్న వెంకటసుబ్బయ్య అనే ప్రైవేట్‌ వ్యక్తికి ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఈ తంతు అంతా జరిగాక బాఽధితుడు హరినాథ్‌, పూర్ణచంద్రరావు ఏసీబీ ఏఎస్పీ విమలకుమారిని ఆశ్రయించడంతో శనివారం పగడ్బందీగా అందరినీ ట్రాప్‌ చేసి పట్టుకున్నారు. మొదట సూళ్లూరుపేట ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి హేమంత్‌, సిరాజ్‌లతో బాధితుడిని మాట్లాడించి రూ.40 లంచం డబ్బులకు ఫౌడర్‌ చల్లి బాధితుడికి ఇవ్వగా ఆ నగదును వెంకటసుబ్బయ్య ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి మరీ పట్టుకున్నారు. వెంకటసుబ్బయ్యను పట్టుకుని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి హేమంత్‌, సిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో పనిచేసిన ఆర్డీఓ కిరణ్మయిని ఉద్యోగ బాధ్యతల నుంచి కూడా తప్పించిన విషయం తెలిసిందే. ఆమెకు సీసీగా పనిచేసిన హేమంత్‌ ఆమెకు సంబంధించి ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ కూడా చూసుకుంటూ ఇలాంటి అవినీతి పనులకు తెరతీయడంతో ఏసీబీ వలలో చిక్కుకున్నారు. శ్రీసిటీకి సెకండ్‌ ఫేజ్‌లో భూములను తీసుకునే క్రమంలో పలు పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో కూడా భారీ ఎత్తున కమీషన్లు తీసుకోవడానికి బేరాలు కుదుర్చుకున్నారని కూడా తెలుస్తోంది. ఇటీవల జరిగిన రిపబ్లిక్‌ దినోత్సవం పేరుతో ఒక్కో మండలం నుంచి రూ.50 వేలు వసూలు చేసి ఆర్డీఓ కార్యాలయాన్ని అవినీతి కూపంగా మార్చేశారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆర్డీఓ కార్యాలయం ఏఓను, ఇతర సిబ్బంది విచారిస్తున్నారు. రికార్డులన్నీ పరిశీలిస్తున్నారు. ఈ దాడుల్లో సీఐలు నరసింహరావు, మల్లికార్జున, విద్యాసాగర్‌, వెంకటరమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ దాడి1
1/1

ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement