విజయవాడ నుంచి టెన్త్ డ్యూటీల కేటాయింపు
● లీప్‌యాప్..డిజిటల్ పద్ధతితో డ్యూటీలు ● సీనియారిటీకి ప్రాధాన్యత ఎక్కడ?
జూనియర్ల కింద సీనియర్లు
పనిచేయడం ఏమిటీ?
జూనియర్లకు సీఎస్‌లు ఇచ్చి వారి కింద సీనియర్లను పనిచేయమని చెప్పడం ఏమిటీ అని పలువురు ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. తాము జూనియర్ల కింద పనిచేయలేని తేల్చిచెబుతున్నారు. ఈ అంశంపై పలువురు బుధవారం డీఈఓను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్రస్థాయిలో డ్యూటీల కేటాయించిన సంగతి తెలిసిందేనని, తమ పరిధిలోని అంశం కాదని ఆయన చెబుతున్నారు. మరోవైపు టెన్త్ మూల్యాంకనం సైతం లీప్‌యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో డ్యూటీలు ఉంటాయని ఇప్పటికే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది.
తిరుపతి అర్బన్: దశాబద్ధాలుగా చూస్తే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆయా జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) పర్యవేక్షణలో ఉపాధ్యాయుల సీనియార్టీని ఆధారంగా విధులు కేటాయిస్తున్నారు. అయితే ఈ ఏడాది కొత్తగా డీఈఓకు డ్యూటీల కేటాయింపుతో సంబంధం లేకుండా రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు విజయవాడ కమిషనర్ ఆఫీస్ నుంచే డ్యూటీల కేటాయింపునకు శ్రీకారం చుట్టారు. లీప్‌యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో ఉపాధ్యాయులకు బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డ్యూటీల విభజన చేపట్టారు. ఆ మేరకు ఉపాధ్యాయులు లీప్ యాప్ ద్వారా తమకు ఏ సెంటర్‌లో డ్యూటీలు ఇచ్చారు..అలాగే సీఎస్‌గా, డీఓగా, ఏడీఓగా డ్యూటీల కేటాయింపులు చూసుకున్నారు. చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) పర్యవేక్షణలో పది పరీక్ష కేంద్రాల నిర్వహణ ఉంటుంది. సాధారణంగా ప్రధానోపాధ్యాయులను సీఎస్‌గా నియమిస్తారు. ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు(డీఓలు)గా సీనియర్లు అయిన స్కూల్ అసిస్టెంట్ల, అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లుగా(ఏడీఓ) జూనియర్లగా ఉంటున్న స్కూల్ అసిస్టెంట్లను విధుల కేటాయింపు దశాబద్దాలుగా చేస్తున్నారు. సీఎస్‌గా పనిచేయాలంటే గతంలో ఏడీఓగాను, డీఓగా పనిచేసిన అనుభవం ఉన్న హెచ్‌ఎంకే సీఎస్ డ్యూటీలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు ముందే సంబంధిత డాక్టర్ సర్టిఫికెట్లను జతపరచి డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని అర్జీ పెట్టు కున్నారు. అయినప్పటికీ వారికి డ్యూటీలు కేటాయించారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లకు ఇన్విజిలేటర్ల డ్యూటీలు అదే మండలంలో లేదా పక్క మండలంలో డ్యూటీల కేటాయింపు చేయాల్సి ఉంది. అయితే దూర ప్రాంతాల్లోని మండలాల్లో ఇన్విజిలేటర్ల డ్యూటీలు ఇవ్వడంపై పలువురు ఉపాధ్యాయులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డ్యూటీలు పారదర్శకంగా లేవు
పది పరీక్షలకు రాష్ట్ర స్థాయి నుంచి కేటాయించిన డ్యూటీలు పారదర్శకంగా కనిపించడం లేదు. జూనియర్ ఉపాధ్యాయులకు చీఫ్ సూపరింటెండెండ్‌లుగా ఇచ్చారు. సీనియర్ ఉపాధ్యాయులకు డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు ఇవ్వడం సరికాదు. రాష్ట్ర కమిషనర్ ఆధ్వర్యంలో డ్యూటీల కేటాయింపులతో తికమకలు చోటుచేసుకున్నాయి. డ్యూటీల్లో చోటుచేసుకున్న పొరబాట్లును సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు టెన్త్ పరీక్షల అనంతరం మూల్యాంకనంలోను డిజిటల్ విప్లవాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకత పాటించాలని కోరుతున్నాం. – ముత్యాలరెడ్డి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
డ్యూటీల కేటాయింపు గందరగోళం
పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు(డీఓ), అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు(ఏడీఓ), చీప్ సూపరింటెండెంట్లకు(సీఎస్) డ్యూటీల కేటాయింపుల్లో గందరగోళంగా ఉంది. జూనియర్లకు చీఫ్ సూపరింటెండెంట్లుగా ఇవ్వడం , సీనియర్ ఉపాధ్యాయులకు డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లుగా డ్యూటీలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. సీనియర్లకు సీఎస్ డ్యూటీలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పలువురు ఉపాధ్యాయులు డ్యూటీల్లో తమకు మినహాయించాలి.
–ఎస్. వెంకటముని, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షులు
డ్యూటీలు పునఃసమీక్షించాలి
పదో తరగతి పరీక్షలకు ఉపాధ్యాయులకు కేటాయించిన డ్యూటీల్లో చోటుచేసుకున్న పొరబాట్లను సరిచేయడానికి అధికారులు పునఃసమీక్షించాల్సి ఉంది. గతంలో డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ పర్యవేక్షణలో డ్యూటీలు వేసేవారు. అయితే ఈ ఏడాది స్థానిక విద్యాశాఖాధికారులతో సంబంధం లేకుండా విజయవాడ నుంచి డ్యూటీలు కేటాయించారు. అయితే జూనియర్లకు చీఫ్ సూపరింటెండెంట్లుగా, సీనియర్లకు డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లుగా బాధ్యతలు భిన్నంగా కేటాయింపులు చేయడం సరికాదు. – ఎస్ బాలాజీ, రాష్ట్ర అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్)
విజయవాడ నుంచి టెన్త్ డ్యూటీల కేటాయింపు
విజయవాడ నుంచి టెన్త్ డ్యూటీల కేటాయింపు
విజయవాడ నుంచి టెన్త్ డ్యూటీల కేటాయింపు


