అంగన్‌వాడీల ఉద్యమ బాట
తిరుపతి అర్బన్: అంగన్‌వాడీ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. బుధవారం కలెక్టరేట్ వద్ద టెంట్లు వేసుకుని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కొన్ని నెలలుగా తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ పాలకులు, అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకపోవడంతో పోరాటాలకు సిద్ధం అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీలను అంగన్‌వాడీ ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా పాలపక్షంలో ఉంటో మరోలా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికే అయా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులు.. న్యాయం కోసం కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఇదే తరహాలో ఈ నెల 27 వరకు తమ నిరసన దీక్షలు కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం మార్చి 2వ తేదీన చలో విజయవాడకు పెద్ద ఎత్తున తరలివెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు చర్చసాగుతుంది. ఈ క్రమంలో సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ నేతలతోపాటు పలు సంఘాలకు చెందిన వారు అంగన్‌వాడీ ఉద్యోగులకు మద్దతు తెలిపారు.


