అమ్మా..నాకేంటీ దుర్గతి?
నన్నెందుకు చంపావమ్మా?
నాన్నను కాదనుకున్నావు..
అందర్నీ దూరంగా ఉంచావు..
ఒంటరిగానే నన్ను పెంచావు..
నీ సుఖం చూసుకుని ఊహాలోకంలో విహరించావు..
సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించావు..
మాయాలోకంలో పడి నన్నే వదిలించుకోవాలనుకున్నావు..
నీ కడుపుచించుకుపుట్టిన నన్నే కర్కశంగా గొంతు నులిమి చంపేశావు..
నీకు తోడుగా నిలిచిన వాడితో కలిసి స్వర్ణమ్మలో కలిపేశావు..
నేనేం తప్పు చేశానమ్మా.. నాకెందుకీ శిక్ష వేశావమ్మా..?
....అన్నట్టు ఉంది.. కదూ ఈ చిత్రం..
ఓ కసాయి తల్లి ప్రియుడి మోజులో పడి నిర్ధాక్షణ్యంగా రెండున్నరేళ్ల పసిగుడ్డును చంపేసిన ఘటన కలకలం సృష్టించింది.
ఏర్పేడు: ‘11 నెలల చి న్నారి ‘పునర్విక’ ప్రాణం నిలబెట్టేందుకు అవసరమైన రూ.16 కోట్లు సమకూర్చేందుకు ఏ సంబంధం లేని లక్షల మంది ఒ క్కటయ్యారు. తమవంతుగా సాయమందించి సమాజంలో మానవత్వం సజీవంగా ఉందని నిరూపించారు. అయితే ఈ కసాయి తల్లి మాత్రం దేహపు దాహార్తితో కళ్లు మూసుకుపోయి కడుపుచించుకుని పుట్టిన పాపను పాశవికంగా చిదిమేసింది. ఆపై స్వర్ణమ్మ ఒడిలో పాతిపెట్టేసి చేతులు దులుపుకుంది. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది.
ఏ‘పాప’ం చేసిందని?
తిరుపతికి చెందిన ఆశాలత భర్త రాజేష్‌తో విడిపోయి తిరుపతి పోస్టల్ కాలనీలో రెండున్నరేళ్ల కుమార్తె దుర్గతో కలిసి ఉంటోంది. ఈమెకు ఏర్పేడు మండలం, చెన్నంపల్లి దళితవాడకు చెందిన రెడ్డికుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రెడ్డికుమార్‌ను పెళ్లి చేసుకోవాలని, ఇందుకు అడ్డుగా ఉన్న తన కుమార్తె దుర్గ ను అంతమొందించాలని భావించింది. తలచిందేతడువుగా ఈనెల 19వ తేదీన దు ర్గను అతికిరాతకంగా చంపేసింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రియుడితో చిన్నా రి మృతదేహాన్ని బైక్‌పై తీసుకుని ప్రియుడి గ్రామానికి స మీపంలో ఉన్న స్వర్ణ ముఖిలో గొయ్యిని తవ్వి పాతిపెట్టింది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలి సిన ప్రతి హృదయం ద్రవించింది. ఏ పాపం చేసిందని పాప ప్రాణం తీశావంటూ ప్రతి గొంతు ఘోషించింది.
గుండెలవిసేలా రోదించిన అవ్వ
ఆశాలత తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశాలత, రెడ్డికుమార్‌తోపాటు వారికి సహకరించిన మరికొందరిని పట్టుకు ని తమదైన శైలిలో విచారించారు. దీంతో చిన్నారి హత్యోదంతాన్ని వారు బయటపెట్టారు. బుధవారం తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి పాపానాయుడుపేట సమీపంలో పాపను పూడ్చిపెట్టిన స్వర్ణముఖి నదిలోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాప మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసి వారి వెంట వచ్చిన చిన్నారి దుర్గ అమ్మమ్మ నాగరత్నమ్మ బోరున విలపించింది.
అమ్మా..నాకేంటీ దుర్గతి?


