కారుచౌకగా కొట్టేశారు!
●
మల్లంగుంట వాసుల నోట్లో మట్టి
పూర్వీకుల నుంచి మల్లంగుంట పంచాయతీకి చెందిన దళితులు ఆ భూములను సాగు చేసుకుంటుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వారందరికీ దరఖాస్తు పట్టాలను మంజూరు చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే తి రుపతి పరిధి విస్తరించడంతో పరిసరాల్లోని భూములకు విలువ భారీగా పెరిగింది. దీంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2003–04లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉండగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు దరఖాస్తు పట్టాలను నిర్ధాక్షిణంగా రద్దు చేశారని చెబుతున్నారు. అప్పటి వరకు ఆ భూములను సాగు చేసుకుంటున్న అనుభవ దారులు కోర్టుల్లో కేసులు వేసినప్పటికీ లెక్క చేయక రెవెన్యూ వెబ్ ల్యాండ్స్‌లో అనాధీనంగా మార్పులు చేసేశారని, ఇప్పు డు రెండు ఎకరాలు టీడీపీ కార్యాలయానికి కేటాయించడంతో పేదల భూములు పెద్దలు కొట్టేశారన్న విమర్శలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి (అనాధీనం)ని టీడీపీ కార్యాలయానికి కేటాయిస్తూ గత ఏడాది నవంబర్ 10వ తేదీన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించారు. అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 495లో 2 ఎకరాల భూమిని ఏడాదికి రూ. వెయ్యి అద్దెతో 33 ఏళ్ల పాటు లీజుకు టీడీపీ జిల్లా కార్యాలయానికి కేటాయిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 33 ఏళ్ల పాటు భూమి లీజు తీసుకునేందుకు కల్పించిన హక్కును సవరించి 66 ఏళ్లకు పెంచడం, ఆ తరువాత కూడా పార్టీలు మనుగడలో ఉంటే 99 ఏళ్ల వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుట్టుగా అప్పగించేసిన రెవెన్యూ శాఖ
రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కట్టబెట్టడానికి రెవెన్యూ అధికారులు గుట్టుగా సహకరించారు. ప్రభుత్వ ఆదేశాలతో చకచకా ఫైళ్లను కదిలించేశారు. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ రెవెన్యూ అధికారి వరకు గుట్టుచప్పుడు కాకుండా అన్ని రకాల పనులు పూర్తి చేయడం, ఆ తరువాత మంత్రి వర్గంలో తీర్మానించి, అనుమతులు పొందేలా చేయడం చూస్తుంటే అధికారులు ఎంత బాధ్యతగా ప్రభుత్వ భూములు కాపాడుతున్నారన్న విషయం అర్థమవుతుంది.
ఎకరాకు ఏడాదికి రూ.వెయ్యి అద్దె
రూ.కోట్లు విలువైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్ల పాటు ఎకరాకు ఏడాదికి రూ.వెయ్యి అద్దెతో లీజుకు కేటాయించిన ప్రభుత్వం ఆ లీజు అగ్రిమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షునిపై రిజిస్టర్ చేసేలా ఉత్తర్వులు జారీ చేస్తూ మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు. దినసరి కూలీగా పనిచేసుకుని బతికే నిరుపేదలు కూడా 20 అంకణాల రేకుల షెడ్డుకు ఒక నెలకు రూ.3 వేలు అద్దె చెల్లిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమికి ఏడాదికి రూ.వెయ్యి అద్దె చెల్లించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
నేడు పార్టీ కార్యాలయానికి భూమి పూజ
కారు చౌకగా కొట్టేసిన భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేయనున్నారు. అది కూడా రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతులు మీదుగా భూమిపూజకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
దళితులను దగా చేసి పార్టీ ఆఫీసు కడతారా..?
తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్ 495లో రూ.60 కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం, ఏడాదికి రూ.1000 మాత్రమే అద్దె చెల్లించేలా చట్టాలను సవరించడం వంటి పరిణామాలపై సమగ్ర విచారణ చేయించాలని న్యాయస్థానంలో కేసు వేస్తాం. మల్లంగుంటకు చెందిన దళితులను దగా చేసి పార్టీ కార్యాలయం కడుతున్నారు. పూర్వీకుల నుంచి సాగు చేసుకునే రైతులకు కడుపుమంట మిగిల్చారు. కోట్ల విలువైన ఆ భూమిని కాజేసే కుట్రకు 2003–04లోనే చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దరఖాస్తు పట్టాలు రద్దుచేస్తున్నామని ఒక పద్ధతి ప్రకారం ఆ భూములు లాక్కుని ఇప్పుడు దర్జాగా టీడీపీ కార్యాలయాన్ని కట్టడం దుర్మార్గం. ప్రజలు అధికారం ఇచ్చింది పది మందికి మంచి చేయడానికే తప్ప కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు కాదు. ఇలా జీఓలు మార్చి ఖరీదైన భూములు కాజేస్తుంటే ప్రజలు మిమ్మల్ని మార్చే రోజు వస్తుందని గుర్తుంచుకోవాలి. – చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త
ఖరీదైన భూమి పార్టీ ఆఫీసుకు అవసరమా?
రూ.కోట్లు విలువైన భూమి పార్టీ కార్యాలయానికి కేటా యించడం అవసరమా?, ఎవరి కోసం ఆ పార్టీ కార్యాల యం పనిచేస్తుంది? అక్కడ పార్టీ కార్యాలయం కట్టడంతో ఎంత మంది ప్రజలకు మంచి జరుగుతుంది? ఖరీదైన భూ ముల్లో విలాస వంతమైన భవనాలు కట్టుకుని ఎవరికి మే లు చేయదలిచారు? రాజ్యాంగ బద్ధంగా అధికారులు, పాలకులు పనిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కారుచౌకగా కొట్టేశారు!


