జగనన్న పాలనలోనే 700 వేదపారాయణదారుల పోస్టులు
తిరుపతి మంగళం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో నిరంతరాయంగా వేద పారాయణం ప్రజ్వలించాలన్న సంకల్పంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో 700 పారాయణదారుల పోస్టుల భర్తీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేదపారాయణం మూగబోయిందని, వేదపారాయణదారుల నియామక ప్రక్రియను అటకెక్కించారన్నారు. అయితే ఎట్టకేలకు నాలుగు నెలల కిందట వేదపారాయణదారుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలిపారు. ఇంటర్వ్యూలు ఫలితాలను విడుదల చేయకుండా వేదపారాయణదారుల నియామక పరిశీలకులు మిమ్మల్ని ఎంపిక చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలంటూ ఇళ్లకు వెళ్లి మరీ డిమాండ్ చేస్తున్నట్లు వేదపారాయణదారులు తమ వద్ద ఆవేదన వెలిబుచ్చారని తెలిపారు. టీటీడీలో రిటైర్డ్ అయిన వ్యక్తిని వేదపారాయణదారుల నియామక పరిశీలకులుగా నియమించడం ఏమిటని? అతను ఒక్కొక్క వేదపారాయణదారు నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేదం ఘోషించే వేదపారాయణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఆ పరిశీలకుడిని టీటీడీ గుర్తించి, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంపంగి మండపంలో ఉద్యోగులు, వేదపారాయణదారులకు బెదిరింపులు
టీటీడీలో జరుగుతున్న అరాచకాలు, అవినీతిపై ఎప్పటికప్పుడు తమకు అందుతున్న సమాచారాన్ని చూసి తట్టుకోలేక టీటీడీ చైర్మన్‌తో పాటు టీటీడీ పెద్ద మనుషులు తిరుమలలోని సంపంగి మండపంలో ఉద్యోగులు, వేదపారాయణదారులతో సమావేశమై బెదిరింపులకు పాల్పడడం వారి అరాచక, అవినీతికి నిదర్శనమని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, మీరు కరుణాకర్ రెడ్డికి సమాచారం ఇస్తున్నట్లు సీఎం కార్యాలయానికి వెళుతున్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. టీటీడీలో ఎంతమందిని బెదిరించినా, భయపెట్టినా బెదిరేవాళ్లేవరూ లేరని, తమకు సమాచారం అందిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. అయినా టీటీడీలో మీరు ఎలాంటి తప్పులు చేయకపోతే భయమెందుకని? ప్రశ్నించారు. ఉద్యో గులు, వేదపారాయణదారులను పిలిపించి బెదిరిస్తున్నారంటే టీటీడీలో పెద్దమనుషులంతా తప్పులు చేస్తున్నట్లే కదా! అన్నారు. టీటీడీ అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచే టీటీడీలో అరాచకాలు, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కేఎం సత్య, తుడా వెంకటరెడ్డి, మునిరెడ్డి పాల్గొన్నారు.


