
ఘాట్ సర్వీసులు వందశాతం కండీషన్‌లో ఉంచుకోండి
తిరుపతి అర్బన్: తిరుమల ఘాట్‌రోడ్డులో నడుపుతున్న ఆర్టీసీ సర్వీసులు వందశాతం కండీషన్‌లో ఉండేలా చూసుకోవాలని డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్ టి.బాలాజీ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీసీ డీపీటీఓ కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని 11 డిపోలకు చెందిన మెకానికల్ ఇంజినీర్లు, మెకానికల్ సూపర్‌వైజర్లకు బస్సుల కండీషన్‌ను గుర్తించడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సెప్టెంబర్ చివరి వారంలో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రతి డిపోలో 100 శాతం కండీషన్‌లో ఉండే సర్వీసులపై దృష్టి పెట్టాలని చె ప్పారు. తిరుమల ఘాట్‌లో 310 డీజిల్ బస్సులు, 50 విద్యుత్ బస్సులు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ 360 సర్వీసులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనంతరం పలు ప్రైవేటు కంపెనీల నుంచి హజరైన ఇంజినీర్లు మాట్లాడుతూ బస్సుల కండిషన్‌పై ప్రత్యే క జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగా బస్సు కండీషన్ ఏలా ఉందో సులభంగా గుర్తించడానికి పలు చిట్కాలను ఆర్టీసీ ఇంజినీర్లకు తెలియజేశారు. అంతేకాకుండా ప్రమాదాల నివారణలో డ్రైవర్లతోపాటు మెకానిక్‌ల పనితనం చాల ఉందని చెప్పారు. వందశాతం బస్సును కండిషన్‌లో ఉంచడం ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. ఘాట్‌లో నడుస్తున్న సర్వీసుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్న కొత్త విడిభాగాలను ఏర్పాటు చేయడమే ఉత్తమంగా పేర్కొన్నారు. అవసరం అయిన మేరకు ఆర్టీసీ కొత్త విడిభాగాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశోక్ లేలాండ్ కంపెనీ రీజినల్ సేల్స్ మేనేజర్ సూర్యనారాయణ బోనీ, సర్వీస్ ఇంజినీర్ వడివేలు, రామే పవర్ స్టీరింగ్ సిస్టమ్ ప్రతినిధులు అర్జున్, నాగరాజు, సర్వీస్ ఇంజినీర్ లూకాస్, టీవీఎస్ నుంచి సర్వీస్ ఇంజినీర్లు శ్రీనివాస్, జెడ్‌ఎఫ్ ఈఎంఆర్ నుంచి కన్నదాసన్, అమర్‌రాజా బ్యాటరీస్ నుంచి మధు, డబ్ల్యూఏబీసీఓ సంస్థ నుంచి సుమన్ తదితరులు పాల్గొన్నారు.