
విలీనం వద్దు
● మా ఊరిలోనే స్కూలు కొనసాగించండి
● కలెక్టరేట్ వద్ద తంబూరు ఎస్సీకాలనీ వాసుల ధర్నా
తిరుపతి అర్బన్: మాకు విలీనం వద్దు.. మా పాఠశాలను మా ఊరిలోనే ఉంచాలని నారాయణవనం మండలంలోని తుంబూరు ఎస్సీకాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. సోమవారం కలెక్టరేట్ వద్ద తమ పాఠశాలను తమ గ్రామంలోనే ఉంచాలంటూ నినాదాలు చేశారు. ఏఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తుంబూరు హరిజనవాడ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 117ను తీసుకువచ్చి మూడు కిలోమీటర్ల లోపల ఉన్న పాఠశాలలను విలీన ప్రక్రియను ప్రారంభించిందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. వందలాది మంది విద్యార్థులకు విద్యను అందించే పాఠశాలలను విలీనం పేరుతో మూసి వేయడం చాలా దారుణమని పేర్కొన్నారు. తంబూరు హరిజనవాడ పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతుండగా కేవలం పదిమంది విద్యార్థులు ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కుమార్, నాయకులు హరికృష్ణ, వినయ్, విష్ణు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.